లఖింపుర్ హింసాత్మక ఘటనలో(Lakhimpur kheri case) ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు చుక్కెదురైంది. అతడికి జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది.
ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్). ఆశిష్ మిశ్రా, లవ్‌కుశ్, ఆశిష్ పాండేతో పాటు శేఖర్ భారతీని ఇదివరకే అరెస్టు చేయగా.. బుధవారం మరో ఇద్దరిని ప్రశ్నించిన అనంతరం కస్టడీలోకి తీసుకుంది.
ఆశిష్ మిశ్రా స్నేహితుడు అంకిత్ దాస్‌ను నేడు అరెస్టు చేసింది. మాజీ మంత్రి అఖిలేశ్ దాస్‌కు.. అంకిత్ దాస్ అల్లుడు. ఘటన జరిగిన రోజు రైతులపైకి దూసుకెళ్లిన ఎస్యూవీ ఇతడిదేనని తెలుస్తోంది.
ఈ కేసులో ఒక్కొక్కరిని విచారిస్తున్న అధికారులు.. 13న తమ ఎదుట హాజరుకావాలని దాస్‌కు సమన్లు పంపింది సిట్. ఉదయం 11 గంటలకు తన లాయర్లతో కలిసి దాస్.. లఖింపుర్‌లోని క్రైం బ్రాంచ్ కార్యాలయానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి లతీఫ్‌ను కూడా విచారించిన అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిని కలిసిన యూపీ మంత్రి..
అక్టోబర్ 3న జరిగిన ఘటనలో(Lakhimpur kheri case).. ప్రాణాలు కోల్పోయిన భాజపా కార్యకర్త, కారు డ్రైవర్ కుటుంబాలను పరామర్శించారు ఉత్తర్‌ప్రదేశ్ న్యాయశాఖ మంత్రి బ్రిజేష్ పాఠక్. ఎలాంటి భద్రత లేకుండానే ఆయన వెళ్లడం గమనార్హం. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించి.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ జరిగింది..
యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో లఖింపుర్ ఖేరిలో అక్టోబర్ 3న (Lakhimpur Kheri news today) హింస చెలరేగింది. టికునియా-బన్బీర్‌పుర్ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులకు, అధికార వర్గాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడం వల్లే రైతులు మరణించినట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి: 'కేంద్ర మంత్రిని తొలగిస్తేనే.. బాధితులకు న్యాయం'