లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన(Lakhimpur Violence) కేసులో అరెస్టైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు(Ashish Mishra News) న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. శనివారం అర్ధరాత్రి ఆయనను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరచగా.. జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్ ఈ మేరకు ఆదేశించారు.
శనివారం ఈ కేసులో 12 గంటల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆశిష్‌ను ప్రశ్నించింది. వైద్య బృందం పరీక్షల అనంతరం.. ఆయనను అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దాంతో జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్.. ఆశిష్‌కు జ్యుడిషీయల్ కస్డడీ విధించారని సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి ఎస్పీ యాదవ్ మీడియాకు తెలిపారు. ఆశిష్ మిశ్రాను పోలీసు రిమాండ్‌కు తరలించాలని న్యాయస్థానానికి తాము దరఖాస్తు సమర్పించామని చెప్పారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ జరపనుందని పేర్కొన్నారు.
అంతకుముందు.. విచారణలో ఆశిష్ మిశ్రా సహకరించలేదని పోలీసులు తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు ఆశిష్ సరైన సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో అతణ్ని అరెస్ట్ చేసినట్లు వివరించారు.
ఈ నెల 3వ తేదీన లఖింపుర్ ఖేరిలో(Lakhimpur Violence) సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతుండగా ఆశిష్ మిశ్రా కారు అక్కడున్న రైతులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు.