abdullapurmet murder case update : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌లో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణను విచారిస్తున్నారు. ఈ క్రమంలో హరిహరకృష్ణ దినచర్య ఎలా ఉంది..? అతడు తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎలా ప్రవర్తించేవాడు.. ప్రేమించిన అమ్మాయితో ఎలా మసులుకునేవాడు.. మిగతా అమ్మాయిలతో తన ప్రవర్తన ఎలా ఉండేది.. అసలు తన ప్రాణస్నేహితుడైన నవీన్‌ను అత్యంత కిరాతకంగా చంపేందుకు ఎలా సిద్ధమయ్యాడు..? హత్య చేసే రోజు హరిహరకృష్ణ ఏం చేశాడు..? ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్లాడు..? ఎవరెవరిని కలిశాడు..? ఇలా అన్ని కోణాల్లో విచారించిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ హత్య రోజు అసలేం జరిగిందనే దానిపై ఆరా తీసిన పోలీసులు విస్మయం కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 17 ఉదయం 9 గంటలకు హరిహరకృష్ణకు నవీన్ ఫోన్ చేశాడు. అదే రోజున నవీన్ హైదరాబాద్‌కు వస్తున్నట్లు చెప్పాడు. నవీన్ కాల్ చేసిన తర్వాత హరిహరకృష్ణ మరో స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఆ మిత్రుడితో కలిసి హరి.. ఉదయం 10.45 గంటలకు ఉప్పల్ వెళ్లారు. అక్కడ ఈ ఇద్దరు ఓ మాల్‌కు వెళ్లి అందులోని ఓ థియేటర్‌లో హాలీవుడ్ సినిమా చూశారు.
Naveen murder case updates : సినిమా చూసిన తర్వాత ఇద్దరు కలిసి నాగోల్ వెళ్లారు. అక్కడ ఓ రెస్టారెంట్‌లో భోజనం చేయాలని ఆర్డర్ ఇచ్చే సమయంలో(మధ్యాహ్నం 1 గంట) నవీన్ నుంచి హరిహరకృష్ణకు ఫోన్ వచ్చింది. తాను హైదరాబాద్ వచ్చానని.. ఎల్బీ నగర్‌లో ఉన్నానని నవీన్ హరికి ఫోన్‌లో చెప్పాడు. ముగ్గురు మిత్రులు కలిసి మళ్లీ అదే రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశారు. భోజనం తర్వాత హరిహరకృష్ణ నవీన్‌ను తీసుకుని మూసారాంబాగ్‌లోని తన సోదరి ఇంటికి వెళ్లాడు.
key facts came out in naveen murder case : తన సోదరి ఇంట్లో ఇద్దరు మాట్లాడుకుంటుండగా నవీన్‌కు ఓ స్నేహితురాలు కాల్ చేసింది. తాను మొబైల్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నట్లు ఆ అమ్మాయి నవీన్‌తో చెప్పింది. తనతో పాటు మొబైల్ స్టోర్‌కు రమ్మని అడిగింది. దీంతో నవీన్, హరి కలిసి సాయంత్రం 5 గంటలకు చైతన్యపురిలోని మొబైల్ షాపునకు వెళ్లారు. ఫోన్ కొనుక్కునేందుకు తన వద్ద డబ్బు తక్కువ పడటంతో ఆ అమ్మాయి నవీన్‌ను కాస్త సాయం చేయమని కోరింది. దీంతో నవీన్ లోన్ యాప్‌లో రూ.14వేలు, పేటీఎం పోస్ట్‌పెయిడ్‌లో రూ.4వేలు లోన్ తీసుకున్నాడు. మొత్తం రూ.30వేల విలువైన మొబైలన్‌ను ఆ అమ్మాయి కొనుక్కుని వెళ్లింది.
ఆ తర్వాత నవీన్, హరిలు.. హరి సోదరి ఇంటికి వెళ్లారు. రాత్రి కావడంతో తాను ఎంజీ వర్సిటీ వసతిగృహానికి వెళతానని హరిహరకృష్ణతో నవీన్ చెప్పాడు. దానికి ఒప్పుకున్న హరిహరకృష్ణ.. తానే వచ్చి హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తానని నవీన్‌ను నమ్మించాడు. రాత్రి 9 గంటల సమయంలో అప్పటికే తన ప్లాన్‌లో భాగంగా రెడీగా ఉంచుకున్న కత్తి, చేతి గ్లౌజ్‌లు భద్రపరచిన బ్యాగ్‌ను తీసుకొని హరిహరకృష్ణ నవీన్‌తో కలిసి బయలుదేరాడు.
వర్సిటీకి వెళ్తుండగా మార్గమధ్యలో పెద్దఅంబర్‌పేట్‌లోని ఓ వైన్స్ వద్ద హరిహరకృష్ణ బైక్ ఆపాడు. అక్కడ మద్యం కొనుగోలు చేసి నవీన్‌తో తాగించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 11.30 గంటల వేళ ఔటర్ రింగ్ రోడ్డు దాటారు. దారిలో నవీన్ ప్రేమించిన యువతితో మాట్లాడమని హరిహరకృష్ణ అతడికి ఫోన్ ఇచ్చాడు. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆమెకు సంబంధించిన రహస్యం చెబుతానంటూ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ ఆ అమ్మాయి విషయంలో కాసేపు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే అదను చూసి హరిహరకృష్ణ నవీన్‌ను కిరాతకంగా హత్య చేశాడు.