Vegetarian Crocodile Passes Away : కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన బబియా అనే శాకాహార మొసలి మరణించింది. ఆదివారం రాత్రి చెరువులో మొసలి మృతదేహం తేలియాడుతూ కనిపించిందని, వెంటనే పోలీసులకు సమాచారం అందించామని ఆలయ అధికారులు తెలిపారు.
ఈ శాకాహార మొసలి చివరిచూపు కోసం వందలాది మంది భక్తులు, పలువురు నాయకులు ఆలయానికి తరలివస్తున్నారు. అందుకు ఆలయ అధికారులు.. మొసలి మృతదేహాన్ని భక్తుల సందర్శనార్థం గుడి పరిసరాల్లో ఉంచారు. సోమవారం మొసలి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేస్తామని ఆలయ అధికారులు చెప్పారు.
పూజారుల కథనం ప్రకారం.. ఒకప్పుడు సరస్సులో పెద్ద మొసలి ఉండేది. ఆంగ్లేయులు ఆ మొసలిని కాల్చి చంపారు. ఆ తర్వాత అదే సరస్సులో బబియా కనిపించింది. అయితే అసలు ఈ మొసలి ఎలా వచ్చిందనేది ఎవరికీ తెలియదు. పైగా దానికి బబియా అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. కానీ అది ఎప్పుడూ క్రూరంగా ప్రవర్తించలేదని, సరస్సులో ఉండే చేపలను కూడా తినలేదని ఆలయ పూజారి చెబుతున్నారు.
ఆలయ పూజారికి, మొసలికి చాలా అవినాభావ సంబంధం ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రోజూ పూజారి ఆ మొసలికి రెండు సార్లు అన్నం పెట్టేవారని, ఒక్కోసారి ఆయనే అన్నాన్ని బంతిలా చేసి ఆ మొసలి నోటికి అందించేవారని చెబుతున్నారు. ఆలయాన్ని రక్షించేందుకు దేవుడు నియమించిన సంరక్షకురాలు ఈ మొసలి అని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.