కర్ణాటక పర్యటనకు వెళ్లిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రిక్తహస్తాలతో వెనుదిరిగారు. మూడు కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలకు అనుమతి కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తిని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తిరస్కరించారు. విజయన్ ప్రతిపాదించిన ప్రాజెక్టులు పర్యావరణంగా సున్నితమైన ప్రాంతాల్లో ఉన్నందున వీటిని వ్యతిరేకిస్తున్నట్లు కర్ణాటక సీఎం వెల్లడించారు. ఆదివారం బెంగళూరులో బొమ్మైని కలిసిన పినరయి విజయన్.. సిల్వర్ లైన్ రైల్వే ప్రాజెక్టు సహా పలు ప్రతిపాదనలపై చర్చించారు. నీలాంబుర్- నంజంగుడ్ రైల్వే లైన్ అభివృద్ధి, తాలాసేరీ- మైసూరు హైవే నిర్మాణం వంటి అంశాలపై చర్చలు జరిపారు. అయితే, ఏ ఒక్కదానికీ కర్ణాటక నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు.
కన్యూరు రైల్వే లైన్ అంశంపై స్పందించిన బొమ్మై.. అందులో 45 కిలోమీటర్ల మార్గం కర్ణాటకలో ఉండనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టును రైల్వే శాఖ తిరస్కరించిందన్నారు. ఇరు రాష్ట్రాలకు అభ్యంతరాలు లేకపోతే ప్రాజెక్టుపై ముందుకెళ్లొచ్చని రైల్వే సూచించిందని.. అయితే ఇది తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. గర్హోల్, బందీపుర్ మధ్య రాత్రి పూట రెండు బస్సులు నడుస్తుండగా.. వాటిని నాలుగుకు పెంచాలని విజయన్ ప్రతిపాదించారు. దీన్ని సైతం తిరస్కరించినట్లు బొమ్మై చెప్పారు.
![Kerala CM Pinarayi Vijayan karnataka tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16405307_news-5.jpg)
"ఇది(రైల్వే లైన్) ఎకోసెన్సిటివ్ జోన్లోకి వస్తుంది. మా రాష్ట్ర ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనకరమూ కాదు. కాబట్టి దీన్ని తిరస్కరించాం. కేరళ-మైసూర్ రహదారి అంశంపైనా చర్చించాం. నాగర్హోల్, బందీపుర్ ప్రాంతాలు సైతం ఎకో సెన్సిటివ్ ప్రాంతాలే. అక్కడే ఏనుగులు, పులుల కారిడార్లు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ, సంపద విషయంలో రాజీపడే ప్రశ్నే లేదని కేరళ సీఎంకు చెప్పాం. ఆ రెండు ప్రతిపాదనలనూ తిరస్కరించాం. అటవీ ప్రాంతాన్ని నాశనం చేయకుండా సొరంగాలు నిర్మించాలని కేరళ సీఎం ప్రతిపాదించారు. కానీ, సొరంగ నిర్మాణం వల్ల భూఉపరితలం కూడా దెబ్బతింటుంది. కాబట్టి దీన్ని కూడా అంగీకరించలేదు."
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక సీఎం
జాతీయ రహదారి నిర్మాణంపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బొమ్మై చెప్పారు. కేంద్రం నుంచి ప్రతిపాదనలు వస్తే దానిపై ఆలోచిస్తామన్నారు.
![Kerala CM Pinarayi Vijayan karnataka tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16405307_news-7.jpg)
![Kerala CM Pinarayi Vijayan karnataka tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16405307_news-1.jpg)