కర్ణాటకలో వంతెన పనుల్లో జాప్యం నివారించేందుకు ఓ మంత్రి రాత్రంతా నది ఒడ్డునే నిద్రించారు. దగ్గరుండి మరమ్మత్తు పనులను పర్యవేక్షించారు. బళ్లారిలోని పరమదేవన్ హళ్లిలోని వేదవతి నదిపై ఉన్న వంతెన పనుల్లో జాప్యం కారణంగానే ఆయన నది ఒడ్డున నిద్రించి పనులను పరివేక్షించినట్లు తెలిపారు.
బళ్లారి శివార్లలోని పరమదేవన్ హళ్లి సమీపంలో ప్రవహించే వేదవతి నదిపై వంతెన పనులు కొనసాగుతున్నాయి. ఈ వంతెన తుంగభద్ర కాలువ మీదుగా వెళ్తుంది. వంతెన పిల్లర్ల నిర్మాణం కోసం గత 20 రోజులుగా నదిలో పనులు జరుగుతున్నాయి. దానికోసం కాలువ నీటిని నిలిపివేశారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులపై ఒత్తిడి తెచ్చి బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేసేందుకు మంత్రి శ్రీరాములు మంగళవారం అక్కడకు చేరుకున్నారు. అయితే.. వంతెన మరమ్మతు పనుల్లో జాప్యం జరుగుతోందని గ్రహించిన ఆయన.. రాత్రంతా నది వద్దనే ఉండిపోయారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భద్రా నది, వాణివిలాస సాగర్ డ్యాంల నుంచి.. వేదవతి నదిలోకి దాదాపు లక్ష క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను కలిపే ఈ వంతెనకు మొత్తం 58 పిల్లర్లు ఉన్నాయి. అయితే గతంలో.. 10వ స్తంభానికి మరమ్మతులు చేపట్టారు. కానీ వరదల కారణంగా 15వ స్తంభం కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ పిల్లర్ ప్లేస్‌లో తాత్కాలికంగా మరో పిల్లర్‌ను నిర్మిస్తున్నారు. దీని వల్ల రైతుల పొలాలకు నీరందడం లేదు. 'ఈ కాల్వ ద్వారా నీరు అందకపోతే.. రైతులు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతారని భయపడుతున్నారు. వారి కోసం.. ఈ బ్రిడ్జ్ మరమ్మతులు పనులు త్వరగా పూర్తిచేయాలి, పనులు పూర్తయిన తర్వాతే ఇక్కడ నుంచి వెళ్తాను' అని మంత్రి శ్రీరాములు తెలిపారు.