దళిత ఉపాధ్యాయురాలు ఉందనే కారణంతో పిల్లలను అంగన్వాడీకి పంపించలేదు తల్లిదండ్రులు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ ఉపాధ్యాయురాలు.. మరొక ప్రాంతానికి బదిలీ చేయించుకున్నారు. తనను అవమానించిన వారికి గుణపాఠం చెప్పేలా.. కొత్తగా చేరిన అంగన్వాడీని కాన్వెంట్లా తీర్చిదిద్దారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ ఘటన కర్ణాటక దావణగెరెలో జరిగింది.
![Dalit teacher barred from teaching](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16272976_1-3.png)
![Dalit teacher barred from teaching](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16272976_1-2.png)
లక్ష్మీ అనే దళిత మహిళ హలెచిక్కనహల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేసేవారు. ఆమె దళిత వర్గానికి చెందిన మహిళ కావడం వల్ల.. తమ పిల్లలను పాఠశాలకు పంపేవారు కాదు కొందరు తల్లిదండ్రులు. పిల్లలను తాకకుండా ఉండాలని సమీపంలోకి కూడా రానిచ్చేవారు కాదు. దళిత మహిళ అనే కారణంతో పాఠశాల ప్రాంగణంలోకి కూడా రావొద్దంటూ ఆమెను వేధించారు. ఇలానే మూడు నెలల పాటు ఆ మహిళను తీవ్ర మానసిక వేదనకు గురిచేశారు. దీంతో చేసేదేమిలేక మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించిన లక్ష్మీ.. సమీపంలోని గోశాలే అంగన్వాడీ కేంద్రానికి బదిలీ చేయించుకున్నారు.
![Dalit teacher barred from teaching](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16272976_1-5.png)
![Dalit teacher barred from teaching](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16272976_1-4.png)
తనను అవమానించిన వారికి తగిన బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కొత్త బోధనా విధానాన్ని ప్రవేశపెట్టారు. కాన్వెంట్లకు దీటుగా అంగన్వాడీని తయారుచేయాలని అనుకున్నారు. అందుకోసం అంగన్వాడీలో చేరిన 30 మంది విద్యార్థులకు కన్నడతో పాటు తెలుగు, ఇంగ్లీషు భాషల స్టడీ మెటీరియల్‌తో పాఠాలు చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం గోశాలే అంగన్వాడీకి మారిన లక్ష్మీ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తున్నారు. తమ పిల్లలను సైతం ఈ పాఠశాలలో చేర్పించేందుకు ఇతర గ్రామాలకు చెందిన తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో లక్ష్మీ ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా పాపులర్ అయిపోయారు. కుల వివక్షకు గురవుతున్న అనేక మందికి లక్ష్మీ ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు.
![Dalit teacher barred from teaching](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16272976_1-1.png)
![Karnataka Dalit Anganwadi teacher](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16267792_dalitteacher.jpg)
ఇవీ చదవండి: వైద్యుడిపై కులవివక్ష!.. వెక్కివెక్కి ఏడ్చిన డాక్టర్.. మేక కోసం తల్లి దారుణ హత్య
కడియాల కోసం దారుణం.. వృద్ధురాలి కాలు నరికి పరార్.. స్కూల్లో దళితులపై కులవివక్ష