కర్ణాటక 16వ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కన్నడ ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఓటు వేస్తున్నారు. నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సినీరంగానికి చెందిన ప్రముఖులు తమ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నా.. వాటిని పక్కన పెట్టి ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో కొన్ని అరుదైన దృశ్యాలు కనిపించాయి.
ఓటేసిన ఒకే కుటుంబంలోని 65 మంది!
చిక్కబళ్లాపుర్ నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన 65 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. నగరానికి చెందిన బాదం కుటుంబసభ్యులు ప్రతి ఎన్నికల్లోనూ తప్పకుండా ఓటు వేస్తారు. తమ పనులను పక్కన పెట్టి ఒకేసారి పోలింగ్ బూత్‌కు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
"మా కుటుంబంలో మొత్తం 65 ఓట్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో అందరం కలిసి వెళ్లి ఓటు వేస్తాం. ఇప్పటికి దాదాపు 15 సార్లు కలిసి ఓటు వేశాం. వచ్చే ఎన్నికల్లో కూడా మేము మా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాము" అని బాదం కుటుంబానికి చెందిన గోపాలకృష్ణ తెలిపారు.
పోలింగ్ బూత్‌లో పెళ్లి కూతురు!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యువ ఓటర్లలో ఓ యువతి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసింది. తన పెళ్లి రోజున.. వధువుగా ముస్తాబై పోలింగ్ బూత్‌కు వచ్చింది. ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసింది. ఎన్నికల అధికారులు ఆమెను అభినందించారు.
కుటుంబసభ్యులతో కొత్త జంట!
మైసూర్లో నూతన దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ కుటుంబసభ్యులతో వచ్చి ఓటేశారు. వీరిని పలువురు అభినందించారు.
ఓటేసిన ప్రముఖులు..
షిగ్గావ్‌లో పోటీ చేస్తున్న కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.. ఆలయంలో పూజలు చేసిన తర్వాత పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటువేశారు. శివమెుగ్గ జిల్లా శికారిపురలో మాజీ సీఎం యడియూరప్ప, తన ఇద్దరు కుమారులు విజయేంద్ర, రాఘవేంద్రతో కలిసి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. శికారిపురలో విజయేంద్ర బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. మాజీ సీఎంలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్ధరామయ్య వరుణలో, జగదీశ్ శెట్టర్ హుబ్బళ్లిలో ఓటు వేశారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకపురలో కుటుంబసమేతంగా వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ సీఎం, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి రామనగరలో ఓటు వేశారు.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. బెంగళూరులో ఓటు వేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి బెంగళూరులోని జయానగర్‌లో ఓటువేశారు.
తరలివచ్చిన శాండల్‌వుడ్ నటీనటులు..
కన్నడ నాట ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు చందనసీమ తారలు భారీగా తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నిల్చొని మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రిషభ్ శెట్టి, ఉపేంద్ర, దర్శన్, జగ్గేశ్, శ్రీమురళి, రమేశ్ అరవింద్, సప్తమి గౌడ, సంయుక్త హార్నాడ్, హర్షిక పూనచ్‌చా, మేఘన గోవాంకర్, బృంద ఆచార్య, శ్వేత శ్రీవాత్సవ్, మిలానా నాగరాజ్, సంగీత శృంగేరి, ఆశాభట్ తదితరులు ఓటేశారు. బెంగళూరులోని శాంతినగర్‌లో సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఓటువేశారు.
సెల్ఫీ పాయింట్ల వద్ద సందడి
తొలిసారి ఓటింగ్‌లో పాల్గొంటున్న యువతను ప్రోత్సహించేందుకు ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. యువతీయువకులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనంతరం ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.
ఆకట్టుకుంటున్న సఖి పోలింగ్ కేంద్రాలు
మహిళా సాధికారతకు చిహ్నంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సఖి బూత్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ 996 పోలింగ్ కేంద్రాల్లో మహిళా అధికారులు, సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తారు. మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎన్నికల అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.
కర్ణాటకలోని 224 శాసనసభ స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లో 8.26 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఉదయం 11 గంటల వరకు 20.99 శాతం నమోదైనట్లు అధికారుల తెలిపారు. మెుత్తం 5,31,33,054 మంది ఓటర్లు ఉండగా.. వారు కోసం 58, 545 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 2,615మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో పురుషులు 2,430 మంది కాగా.. మహిళా అభ్యర్థులు 184 మంది, ఒక ట్రాన్స్‌జెండర్ ఎన్నికల బరిలో ఉన్నారు.