కాంతార సినిమాతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు నటుడు రిషభ్ శెట్టి. ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన రిషభ్ శెట్టి.. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కలిశారు. ఈ నేపథ్యంలోనే రిషభ్ శెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకే బుధవారం ఆయన్ను కలిశానని రిషబ్ శెట్టి తెలిపారు. తాను కాంతార సినిమా చేసేటప్పుడు అడవుల్లో తిరిగానని.. దానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందించానని చెప్పారు.
"నేను కాంతార చేసేటప్పుడు అడవుల్లోని ప్రజలను కలిశాను. వీరితో పాటు అటవీ అధికారులను కలిసే అవకాశం కూడా వచ్చింది. అడవుల్లో మంటలు లాంటి అనేక సమస్యలు నా దృష్టిలోకి వచ్చాయి. వీటన్నింటిని కలిపి 20 పాయింట్లతో వినతి పత్రాన్ని సమర్పించాను. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన లాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు గర్వంగా ఉంది."
--రిషభ్ శెట్టి, నటుడు
కొన్నిరోజుల క్రితం అడవిలో సంభవించిన మంటలపైనా రిషభ్ శెట్టి ట్వీట్ చేశారు. అడవుల పరిరక్షణ కోసం పాటుపడుతున్న అధికారులకు మనం అందరం సహాయ పడాలని కోరారు. అడవుల పరిరక్షణ బాధ్యత అధికారులది మాత్రమే కాదని.. ఇది మనందరి బాధ్యత అని ట్వీట్ చేశారు. ఈ మంటల్లో పడి సుందరేశ్ అనే అటవీ అధికారి మృతి చెందారు.
ఎన్నికల నేపథ్యంలోనే ప్రధాని సమావేశం
అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు కర్ణాటకకు చెందిన ప్రముఖులు. వీరిలో రిషభ్ శెట్టి సహా కేజీఎఫ్ స్టార్ యశ్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్, జవగళ్ శ్రీనాథ్ వంటి మాజీ క్రికెటర్లను.. మనీశ్ పాండే, మయాంక్ అగర్వాల్ వంటి ప్రస్తుత క్రికెటర్లు ఉన్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలు దేశ సంస్కృతిక వారసత్వాన్ని గొప్పగా చాటుతున్నాయని మోదీ కొనియాడారు. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ను ఆయన గుర్తు చేసుకున్నారు. తమ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వారితో వివరించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కన్నడనాట అధికారంలో ఉన్న బీజేపీ.. కాంగ్రెస్‌తో ఎన్నికల్లో పోటీ పడనుంది. ఈ తరుణంలోనే మోదీ.. కన్నడ ప్రముఖులతో వరుసగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. నేరుగా సెలబ్రిటీలతో భేటీ అయి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించడం ఓ స్ట్రాటజీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రముఖులంతా తమవైపే ఉన్నారని ఓటర్లకు పరోక్షంగా సందేశం పంపినట్లు అవుతుందని విశ్లేషిస్తున్నారు.
ఇవీ చదవండి : బీజేపీ 'ప్రాజెక్ట్-K'.. కాంతార, కేజీఎఫ్ స్టార్లతో ఎలక్షన్ రాజకీయం!
త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం.. మంత్రివర్గంలోకి 8 మంది