Kanpur man blessed with three kidneys: కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతాయంటారు. కొన్ని వార్తలు విన్నప్పుడు అది నిజమే అనిపిస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన.. సుశీల్ గుప్తా అనే 52 ఏళ్ల వ్యాపారికి పుట్టుకతోనే మూడు కిడ్నీలు ఉన్నట్లు 2020లో వైద్యులు గుర్తించారు. అతనికి అల్ట్రాసౌండ్ ద్వారా బ్లాడర్ సర్జరీ(మూత్రపిండాల శస్త్రచికిత్స) చేస్తున్నప్పుడు వైద్యులు దీన్ని గుర్తించారని గుప్తా ఈటీవీ భారత్‌కు వెల్లడించారు.
ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. దాని వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదని అన్నారు గుప్తా. అది తనకు దేవుడు ఇచ్చిన వరం అని తెలిపారు. తాను మరణించాక.. తన కళ్లను దానం చేస్తానని ప్రకటించారు. ఎవరికైనా కిడ్నీ అవసరం అయితే వారికి తన మూడవ కిడ్నీని దానం చేస్తానని.. ఆ విషయంలో వెనకడుగు వేయనని తెలిపారు.
"కొన్ని నెలలు ముందు వైద్యులు నాకు మూడు కిడ్నీలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం మూడు కిడ్నీలు ఉన్నా.. నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదు.. ఆరోగ్యంగానే ఉన్నాను. అది నాకు దేవుడిచ్చిన వరం. నేను చనిపోయాక నా కళ్లను దానం చేస్తాను. ఎవరికైనా కిడ్నీ అవసరమై నన్ను సంప్రదిస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తాను.''
-సుశీల్ గుప్తా, వ్యాపారవేత్త
ఇవీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది దుర్మరణం