లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో(Lakhimpur Kheri Incident) బాధితులకు న్యాయం జరిగేంతవరకు తన పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఘటనలో(Lakhimpur News) ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
"ప్రజాస్వామ్యంలో న్యాయం పొందడం ఓ హక్కు. న్యాయం కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తాను. బాధిత కుటుంబాలను నిన్న కలిసినప్పుడు వారంతా న్యాయం కావాలని మాత్రమే కోరారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే.. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
లఖింపుర్ ఘటనలో (Lakhimpur Kheri Incident) మృతిచెందిన వారి కుటుంబాలను బుధవారం పరామర్శించారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వీరి వెంట పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌తో పాటు కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, దీపీందర్ సింగ్ హుడా ఉన్నారు.
మరికొంతమంది రైతు కుటుంబాలను ప్రియాంక నేడు పరామర్శించనున్నారు.
ఘటన నేపథ్యం..
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం.. లఖింపుర్ ఖేరిలో (Lakhimpur Kheri Incident) తికోనియా-బన్బీపుర్ రహదారిపై అన్నదాతలు ఆందోళన చేస్తుండగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తనయుడు(Ajay Mishra Son) ఆశిష్ మిశ్రా కారు, మరో వాహనం వారిపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించగా.. అనంతరం రైతుల దాడిలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి తనయుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. యూపీ ప్రభుత్వం ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేసింది.
ఇదీ చూడండి: లఖింపుర్ ఘటనపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ