Chhattisgarh Borewell Operation: ఛత్తీస్‌గఢ్‌లో బోరుబావిలో పడ్డ 12 ఏళ్ల బాలుడి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 60 అడుగుల లోతులో చిక్కుకుపోయిన రాహుల్ సాహును బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. బోరు బావి సుమారు 80 అడుగుల లోతు ఉండగా.. బాలుడు 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతడిని సురక్షితంగా బయటకు తీస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
Chhattisgarh boy fell in borewell: శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటివద్ద ఆడుకుంటూ.. వెళ్లి బోరు బావిలో పడిపోయాడు రాహుల్. ఈ సంఘటన జాంజ్గీర్ చాంపా జిల్లా, మాల్ఖరోదా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిహరీద్ గ్రామంలో జరిగింది. ఇంటి వద్ద తమ కుమారుడు కనిపించటం లేదని వెతుకుతుండగా.. బాలుడి అరుపులు విని బోరుబావిలో పడిపోయినట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. వెంటనే 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
'80 గంటల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాహుల్‌ను త్వరలోనే బయటకు తీస్తాం. బాలుడి వైద్య పరిస్థితి ఇప్పుడు స్థిరంగానే ఉంది. సీఎం భూపేశ్ బఘేల్ వీడియో కాల్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు' అని జిల్లా కలెక్టర్ జితేంద్ర శుక్లా తెలిపారు. మధ్యలో అడ్డుగా వస్తున్న రాళ్లను పగలగొడుతున్నట్లు తెలిపారు. అంబులెన్సులు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. సుమారు 150 మంది అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 'రెస్క్యూ ఆపరేషన్ చాలా క్లిష్టంగా ఉంది. ఇది మాకో సవాల్‌తో కూడిన లక్ష్యంగా మారింది' అని ఎస్పీ విజయ్ అగర్వాల్ పేర్కొన్నారు.
మరోవైపు, ముఖ్యమంత్రి బఘేల్.. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాలుడిని సురక్షితంగా ఇంటికి చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. బాలుడిని బయటకు తీసేందుకు రోబోలను వినియోగిస్తున్నామని చెప్పారు. రోబో ఆపరేటర్ మహేశ్ ఆహిర్తోనూ సీఎం మాట్లాడారు.
ఇదీ చదవండి: