జమ్ముకశ్మీర్‌లో మరో ఘాతుకానికి తెగబడ్డారు ఉగ్రవాదులు. కుల్గాంలో అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోనేపై గురువారం దారుణంగా కాల్పులు జరిపారు. ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలువలేదు.
ఇదే జిల్లాలో భాజపా నేత జావీద్ అహ్మద్‌ను కాల్చి చంపిన రెండు రోజులకే ఈ ఘటన జరిగింది. అంతకుముందు ఆగస్టు 9న కూడా అనంత్‌నాగ్ జిల్లాలో ఇంట్లోకి చొరబడి మరీ భాజపా సర్పంచ్‌ను, అయన భార్యను క్రూరంగా చంపేశారు ముష్కరులు.
అంతులేని రాజకీయ హత్యలు!
ఈ ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జమ్ముకశ్మీర్ నేతలు. రాజకీయ హత్యలకు అంతం లేకుండా పోతోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. గులాం హత్య ఘటనను ఖండించిన ఆమె.. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. కాగా, ప్రధాన రాజకీయ నాయకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే సరికొత్త ధోరణి తీవ్ర ఆందోళనకరమని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా అన్నారు.