భారతీయ సంప్రదాయ వైద్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా.. ఆయుష్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సలో అశ్వగంధ ఔషధాన్ని వినియోగించడంపై.. బ్రిటన్‌లోని హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థ(ఎల్ఎస్హెచ్టీఎం)తో కలిసి అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థ(ఏఐఐఏ) అధ్యయనం చేపట్టనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందాన్ని(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయూలో భాగంగా.. బ్రిటన్‌లోని లీసిసెట్ర్, బర్మింగ్‌హామ్, లండన్ నగరాలకు చెందిన 2,000 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
శాస్త్రీయ ఆధారాలు..
భారతీయ సంప్రదాయ ఔషధ మూలికల్లో ఒకటైన అశ్వగంధ(విఠానియా సోమ్నిఫెరా).. ఒత్తిడిని తగ్గించడం సహా రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధంగా పేరు పొందింది. అయితే.. ఇది కొవిడ్‌ను తగ్గిస్తుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ప్రస్తుతం దీనిపై ఏఐఐఏ, ఎల్ఎస్హెచ్టీఎం చేపట్టనున్న క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఇందుకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లభ్యం కానున్నాయి. కొవిడ్ చికిత్సకు సంబంధించి అధ్యయనంపై ఇతర దేశాల సంస్థలతో భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ చేతులు కలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
"మూడు నెలలపాటు ఒక గ్రూపులోని 1,000 మందికి అశ్వగంధ మాత్రలను అందిస్తాం. మరో వెయ్యి మందికి అశ్వగంధ తరహాలోనే ఉండే ప్లేసిబో(ప్రభావం లేని మందు) మాత్రలను అందిస్తాం. తాము ఏ మాత్రలను తీసుకుంటున్నామో ఇందులో పాల్గొన్న వారికే కాకుండా.. వారిని పరిశీలించే వైద్యులకు కూడా తెలియదు. వారంతా 500మిల్లీగ్రాముల మాత్రలను రోజుకు రెండు సార్లు చొప్పున తీసుకుంటారు. అనంతరం వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తారు."
-తనూజ మనోజ్ నేసారీ, ఏఐఐఏ డైరెక్టర్
16 నెలలపాటు జరిగిన వందకుపైగా సమావేశాల తర్వాత ఎల్హెచ్టీఎస్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోగలిగామని మనోజ్ నేసారీ తెలిపారు. తమ అధ్యయనాన్ని డబ్ల్యూహెచ్ఓ-జీఎంపీ ధ్రువీకరించిందని చెప్పారు.
ఇదీ చూడండి: అశ్వగంధతో కరోనాకు ఔషధం!