దాయాది పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని చెప్పారు. జమ్ముకశ్మీర్‌ని దేశంలోనే అత్యంత శాంతియుతమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ షా.. రెండో రోజు బారాముల్లాలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడారు.ఉగ్రవాదం వల్ల ఎవరైనా లబ్ధి పొందారా? అని అక్కడున్న వారిని ప్రశ్నించారు. 1990 నుంచి ఇప్పటి వరకు 42 వేల మందిని ఉగ్రవాదం పొట్టన పెట్టుకుందని చెప్పారు.
వరుసగా రెండో రోజు కూడా అమిత్‌షా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో వెనకబడిపోవడానికి అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), ముఫ్తీ (పీడీపీ), నెహ్రూ-గాంధీ (కాంగ్రెస్) కుటుంబాలే కారణమని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి జమ్ముకశ్మీర్‌ను ఈ మూడు కుటుంబాలే ఎక్కువ కాలం పాలించాయని చెప్పారు. ఆ మూడు పార్టీలు అవినీతిలో మునిగిపోయాయని చెప్పారు. వారికి పరిపాలన చేతకాక, అభివృద్ధి లేమితో వెనకబడిపోయిన దేశాన్ని మోదీ ప్రగతి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు.
"పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని కొందరు చెబుతున్నారు. పాకిస్థాన్‌తో మనం ఎందుకు చర్చలు జరపాలి? అది జరగని పని. మేం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం. జమ్ముకశ్మీర్ ప్రజలతో మాట్లాడతాం" అని అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సహించబోదని, జమ్ము కశ్మీర్‌ను దేశంలోనే శాంతియుత ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్ని గ్రామాలకు విద్యుత్ సదుపాయం ఉందని అమిత్ షా అక్కడున్న వారిని ప్రశ్నించారు. గత మూడేళ్లలో కశ్మీర్‌లోని అన్ని గ్రామాలకు విద్యుత్ అందించామని చెప్పారు.