కొవిడ్-19 టీకాలను (Covid Vaccination in India) అందుబాటు ధరలో ప్రజలకు చేరువ చేయడంలో ప్రపంచంలో మరే దేశం కన్నా మిన్నగా భారత్ వ్యవహరించిందని 'భారత్ బయోటెక్' సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల ఆదివారం పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 'టైమ్స్ నౌ' నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో వ్యాక్సినేషన్ లక్ష్య విస్తృతిని ప్రస్తావించారు.
"నిర్దిష్ట కాలావధిలోగా దేశంలో 130 కోట్ల మందికి టీకా వేయాల్సి రావడం చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. నిజానికి భారత్‌తో పోలిస్తే అమెరికాలోనే ఎక్కువ టీకాలు ఉన్నాయి. అయినా అక్కడ 16 కోట్ల మంది మాత్రమే వ్యాక్సిన్లు పొందారు. టీకాలు వేసే విషయంలో మన దేశం అద్భుతంగా పనిచేసిందని చెప్పడానికి గర్వపడుతున్నా"
- డాక్టర్ కృష్ణ ఎల్ల, భారత్ బయోటెక్ సీఎండీ
కొవిడ్ నివారణకు ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. "మొదట కొవాగ్జిన్, ఆ తర్వాత నాసిక (నేసల్ వ్యాక్సిన్) టీకాలతో కూడిన మిశ్రమ డోసు ఇవ్వడంపై కసరత్తు చేస్తున్నాం. దీనివల్ల కరోనాపై పోరాడేలా సహజసిద్ధ రోగనిరోధక వ్యవస్థకు కొవాగ్జిన్ తర్ఫీదు ఇస్తుంది. ఆ తర్వాత నాసిక టీకాతో దానికి మరింత ఊతం లభిస్తుంది. ఫలితంగా ఐజీజీ, ఐజీఏ, మ్యూకోసల్ ఇమ్యూనిటీ స్పందనలు వెలువడతాయి. ఈ మూడు రకాల రోగనిరోధక రక్షణలు చాలా శక్తిమంతం. ఇన్‌ఫెక్షన్ బారి నుంచి అవి రక్షిస్తాయి. వచ్చే రెండు నెలల్లో దీనిపై భారీగా డేటా అందుబాటులోకి రావొచ్చు. దీనికితోడు కొవాగ్జిన్ బూస్టర్ డోసుపైనా కృషి చేస్తున్నాం" అని కృష్ణ తెలిపారు. మూడో డోసు అవసరమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. దీనిపై డేటాను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వ నియంత్రణ సంస్థలేనని పేర్కొన్నారు. నాసిక టీకా బాగా పనిచేస్తే తమ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు అవుతుందన్నారు.
ఇదీ చదవండి: వణికిస్తున్న మహమ్మారి- లక్ష్యానికి దూరంగా టీకా ప్రక్రియ