చైనాతో తలపడేందుకు భారత్ మరో కొత్త ఆయుధం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉన్న త్రివిధ దళాలకు తోడు రాకెట్ ఫోర్స్‌ను తయారు చేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం బాలిస్టిక్, క్రూయిజ్, క్వాజీ బాలిస్టిక్ క్షిపణలను అభివృద్ధి చేస్తోంది. రాకెట్ ఫోర్సును ఏర్పాటు చేసే దిశగానే ఈ అడుగులు పడుతున్నట్లు రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
చైనా 1966లోనే ఇటువంటి రాకెట్ ఫోర్సుకు పునాది వేసింది. 2015లో పీఎల్‌ఏ 2వ ఆర్టిలెరీ ఫోర్స్ పేరు మార్చి రాకెట్ ఫోర్సుగా చేసింది. దీని వద్దే చైనాలో అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి. మూడేళ్లలో దీని సైజును 33 శాతం పెంచినట్లు వార్తలొస్తున్నాయి. దీని పరిధిలోకి భారత్‌లోని నగరాలన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక రాకెట్ ఫోర్స్ కలిగిన దేశాల్లో డ్రాగన్ అగ్రభాగాన నిలిచింది. భారత్‌తో సరిహద్దు వివాదం రేగగానే చైనాకు చెందిన రాకెట్ ఫోర్స్‌ను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించింది. ఈ క్రమంలో భారత్ కూడా ఇటీవల రాకెట్ ఫోర్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టింది.
ఏమిటీ రాకెట్ ఫోర్స్..?
భవిష్యత్తులో యుద్ధాలు నేరుగా జరగవు.. దళాలు ముఖాముఖీ తలపడే సమయానికి శత్రువును పూర్తిగా కుంగదీసేస్తారు. ఇలాంటి వ్యూహంలో భాగంగానే ఉక్రెయిన్ పై రష్యా తొలి రోజు క్షిపణుల వర్షం కురిపించి కీలక మౌలిక వసతులను ధ్వంసం చేసింది. క్షిపణులు, డ్రోన్లు, సైబర్ ఆయుధాలే కీలక పాత్ర పోషిస్తాయి. "భవిష్యత్తు యుద్ధాలు చాలావరకూ 'కాంటాక్ట్ లెస్', మానవ రహితంగా జరుగుతాయి. ట్యాంకులు, సైనిక పోరాటాల కంటే సుదూరం నుంచి ప్రయోగించే స్టాండ్ ఆఫ్ ఆయుధాలు, సైబర్ ఆయుధాలు, రహస్య కార్యకలాపాలతో జరుగుతాయి" అని సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్‌కు రాసిన పేపర్‌లో బ్రిగేడియార్ బిమల్ మోంగా పేర్కొన్నారు.
భారత్ రాకెట్ ఫోర్సుకు సన్నాహాలు..
భారత్ గత కొన్ని నెలలుగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో నాటి సీడీఎస్ దివంగత బిపిన్ రావత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ క్రమంలో భాగంగానే ప్రళయ్ క్షిపణిని వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇది 150-500 కిలోమీటర్ల మధ్య లక్ష్యాలను ఛేదించగలదు.
పైగా ఇది క్వాజీ బాలిస్టిక్ విధానంలో ప్రయాణిస్తుంది. అంటే బాలిస్టిక్ క్షిపణి మాదిరిగా వెళ్లినా.. అవసరమైన సమయంలో దిశ మార్చుకోగలదు. దీంతో శత్రు గగనతల రక్షణ వ్యవస్థలు వీటిని గుర్తించలేవు. అంటే వాస్తవాధీన రేఖ సమీపంలో చైనా సైనిక మౌలిక వసతులను ఇది ధ్వంసం చేయగలదు. తాజాగా ఈ క్షిపణి అభివృద్ధిని వేగవంతం చేసింది. ఇటీవలే 24 గంటల వ్యవధిలో రెండు సార్లు దీనిని పరీక్షించింది. తాజాగా 120 క్షిపణుల కొనుగోలు ఆర్డర్‌కు రక్షణశాఖ క్లియరెన్స్ లభించింది. ఈ క్షిపణిని సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించే కె-సిరీస్ క్షిపణి నుంచి అభివృద్ధి చేశారు.
మరో వైపు భారత్ అణ్వాయుధాలు ప్రయోగించే అగ్ని-5 రేంజిని మరింత పెంచి ప్రయోగించింది. దీనిలో ఇనుము స్థానంలో లోహ సమ్మేళనాలు(అలాయ్) వాడటంతో బరువు తగ్గి దీని రేంజ్ 5,000 నుంచి 7,000 కిలోమీటర్లకు చేరినట్లు రక్షణ రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని రేంజిలోకి చైనా ప్రధాన నగరాలు మొత్తం వచ్చాయి. ఈ క్షిపణి పరీక్షకు భారత్ బంగాళాఖాతంలో నోటామ్(నోటిస్ టు ఎయిర్ మన్) జారీ చేయగానే చైనాకు చెందిన నిఘా నౌక యువాన్‌వాంగ్-5 హిందూ మహా సముద్రంలో ప్రత్యక్షమైంది. ఈ క్షిపణి సామర్థ్యాన్ని అంచనా వేయడానికే ఇది వచ్చింది.
ఈ నేపథ్యంలో అగ్ని-5ను చైనాలోని నగరాలను టార్గెట్ చేయడానికి, అణు దాడులు చేయడానికి వాడే అవకాశం ఉంది. ఇక ప్రళయ్ క్షిపణిని సరిహద్దుల్లో మోహరించి.. చైనా రాకెట్ ఫోర్స్ పరికరాలు, ఇతర సైనిక స్థావరాల విధ్వంసానికి వాడొచ్చు. ప్రళయ్ క్షిపణులు రోడ్డు మార్గం ద్వారా తరలించే అవకాశం ఉండటంతో వేగంగా మోహరించవచ్చు.
రాకెట్ ఫోర్సు నిర్వహిణ భారత్ భరించగలిగే స్థాయిలో ఉండాలి. అగ్ని వంటి దీర్ఘ శ్రేణి క్షిపణులను భారీ స్థాయిలో ఉపయోగించలేం. ఇక బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి ఉంది. కానీ, ఒక్కో క్షిపణి ఖరీదు రూ.34 కోట్లు ఉంటుంది. భారత్ రాకెట్ ఫోర్సుకు మరింత చౌకగా లభించే క్షిపణులు అవసరం. ఆర్థికంగా ప్రళయ్ క్షిపణి కొంత చౌకగా తయారు కావడం కలిసొచ్చే అంశం.
సరిహద్దు వద్ద సొరంగాలు అందుకేనా..
భారత్ సరిహద్దుల్లో భారీ ఎత్తున వ్యవూహాత్మక సొరంగాలను నిర్మిస్తోంది. ఇవి కేవలం కీలక సమయాల్లో దళాలను వేగంగా తరలించడంతోపాటు పలు వ్యూహాత్మక అవసరాలను పూర్తి చేస్తాయి. వీటిల్లో భూమిపై నుంచి ప్రయోగించే క్షిపణులను భద్రపర్చేందుకు కూడా వీలుంటుంది. చైనా రాకెట్ ఫోర్స్ కూడా సరిహద్దు వద్దే మోహరించింది. ఈ నేపథ్యంలో శత్రువులు మందస్తుగా దాడి చేసి మన క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేయకుండా భూగర్భ నిర్మాణాలు సురక్షితమైనవి. ఈ సొరంగాలు వాటికి కూడా ఉపయోగపడతాయి. చైనా వద్ద కూడా భారీ ఎత్తున భూగర్భ నిర్మాణాలు ఉన్నాయి. అటువంటి నిర్మాణాల సంఖ్యను ఇంకా పెంచుకొంటూ పోతోంది.
ఇదీ చదవండి: 'అగ్నివీర్' అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రారంభం.. 2,850 మందికి ఆరు నెలల శిక్షణ