ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఓ పాఠశాల యాజమాన్యం చేసిన పనిని అందరూ తప్పుబడుతున్నారు. స్కూల్లో చదివే విద్యార్థినులు మధ్యాహ్న భోజనం తినడం వల్ల కొంత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలికలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక వారిని ఆత్మలు ఆవహించాయని మాంత్రికుడిని పిలిపించింది స్కూల్ యాజమాన్యం.
ఇదీ జరిగింది..
సోమవారం మధ్యాహ్నం విద్యార్థినులు పాఠశాలలో భోజనం తిన్నారు. తిన్న కాసేపటికే 15 మంది బాలికల ఆరోగ్యం క్షీణించింది. అస్వస్థకు గురైన విద్యార్థినులను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలికల వయసు తొమ్మిది నుంచి 13 సంవత్సరాల మధ్య ఉంటుందని పాఠశాల వర్గాలు వెల్లడించాయి. సోమవారం జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా సబ్ డివిజనల్ కలెక్టర్ అరుణ్ దీక్షిత్ చెప్పారు. ఇందుకు సంబంధించి వాస్తవాలను తెలుసుకుంటామని అన్నారు. మధ్యాహ్న భోజనం నమూనాలను పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. పిల్లల ఆరోగ్యం పాడవటానికి పాఠశాలలో ఉన్న దెయ్యమే కారణమని గ్రామస్థులు చెబుతున్నారు. పాఠశాలలో ఓ మహిళ తెల్ల చీర కట్టుకొని తిరగడం చూశానని.. ఆమే దెయ్యం అని అనుకుంటున్నామని ఓ విద్యార్థిని తెలిపింది. దీంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురై స్పృహతప్పి పడిపోయారని స్థానికులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని పన్వాడి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ జయ్‌ప్రకాశ్ ఉపాధ్యాయ్ చెప్పారు.