గుజరాత్ జునాగఢ్‌లోని గిర్ అడవులకు చెందిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫొటోలో ఓ సింహం రోడ్డు మధ్యలో కూర్చుని ఉండగా.. పర్యటకులు దానితో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు. సింహానికి కొన్ని మీటర్ల దూరంలో, వాహనాల్లో నిలబడి ఫొటోలు దిగారు. ఏకకాలంలో దాదాపు ఆరు వాహనాలు ఆ సింహాన్ని చుట్టుముట్టాయి.
ఈ ఫొటోను దిల్లీకి చెందిన గ్రీన్ సర్కిల్ అనే ఎన్జీఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌ను జునాగఢ్‌కు చెందిన మాజీ జడ్జి జయదేవ్ ధధల్ రీట్వీట్ చేస్తూ.. పర్యటకులపై విరుచుకుపడ్డారు. పర్యటకులు వన్యప్రాణుల చట్టాన్ని ఉల్లంఘించారని, వారిపై తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి.. అటవీశాఖ అధికారులు, సిబ్బంది, వాహనాలు నడిపిన డ్రైవర్లను విడిచిపెట్టకూడదని సూచించారు.
ఈ వ్యవహారంపై ససన్ గిర్ డిప్యూటీ ఫారెస్ట్ కన్జర్వేటర్ మోహన్ రామ్‌ను ఈటీవీ భారత్ సంప్రదించేందుకు ప్రయత్నించింది. కానీ ఎటువంటి స్పందన లభించలేదు.
ఇదీ చూడండి:- జంతు సంరక్షణ మానవాళికి రక్షాకవచం