గనుల లీజు విషయంలో అక్రమాలు జరిగాయన్న కేసులో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. రాంచీలోని కార్యాలయంలో ఈడీ అధికారులు.. సొరెన్‌ను ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో.. దర్యాప్తునకు హాజరుకావాలని ఇదివరకే సోరెన్‌కు నోటీసులు జారీ చేసింది.
మైనింగ్ స్కామ్ కేసులో రూ.వెయ్యి కోట్ల మేర మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తుండగా.. వీటిని సోరెన్ ఖండించారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. విపక్షాలు చేస్తున్న కుట్రలకు తాను బాధితుడిగా మారానంటూ ఆరోపించారు. సమగ్రంగా విచారణ జరిపిన తర్వాతే.. దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేయాలని అన్నారు. 'ఆరోపణలేవీ నిజాలు అని అనిపించడం లేదు. గనులు, ఖనిజాలకు సంబంధించి వార్షిక రాబడి కూడా రూ.వెయ్యి కోట్లు ఉండదు. అలాంటిది.. రూ.వెయ్యి కోట్ల మనీలాండరింగ్ జరిగిందని ఎలా నిర్ధరణకు వచ్చారో వారి నుంచి తెలుసుకోవాల్సి ఉంది' అని సోరెన్ పేర్కొన్నారు.
మరోవైపు, సోరెన్‌కు మద్దతుగా ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. సీఎంకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈడీ విచారణకు సీఎం హాజరవుతున్న నేపథ్యంలో అన్ని భద్రతా పరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించినట్లు తెలిపారు.