బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్లో.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై అధికార పార్టీ దాడి చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్లో పెగాసస్ సాఫ్ట్వేర్ ఉందని, కాల్స్ రికార్డింగ్ చేస్తున్నారని.. ఫోన్లలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనను హెచ్చరించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 'లెర్నింగ్ టు లిజన్ ఇన్ ది 21 సెంచరీ' అనే లెక్చర్ సందర్భంగా రాహుల్ ఉపన్యసించారు.
" నా ఫోన్లో పెగాసస్ సాఫ్ట్వేర్ ఉంది. నాతో పాటు చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లలో కూడా పెగాసస్ ఉంది. ఫోన్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఎందుకంటే తాము అంతా రికార్డ్ చేస్తున్నామని కొంత మంది ఇంటెలిజెన్స్ అధికారులు నన్ను హెచ్చరించారు. ఇలా నిరంతరం మేము ఒత్తిడికి గురవుతాము. ప్రతిపక్షాలపై దొంగ కేసులు పెడుతున్నారు. నాపై కూడా చాలా కేసులు ఉన్నాయి. కానీ అవన్నీ.. ఉద్దేశపూర్వకంగా నమోదు చేసిన కేసులే. వాటినే మేము ఎదుర్కోదలచుకున్నాం"
-- రాహుల్ గాంధీ, కాగ్రెస్ పార్టీ అగ్రనేత
ప్రతిపక్షనాయకులను జైళ్లలో వేస్తున్నారు..
"భారత ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉంది. దాడికి గురవుతోంది. ఈ విషయం చాలా మందికి తెలుసు. చాలా రోజుల నుంచి వార్తల్లో వస్తోంది. నేను ఇండియాలో ప్రతిపక్ష నేతను.. మా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యానికి అవసరమైన పార్లమెంట్, ఫ్రీ ప్రెస్, న్యాయవ్యవస్థ తదితర అంశాలన్నింటినీ ప్రభుత్వం నిర్బంధిస్తోంది." అని రాహుల్ గాంధీ భాజపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అనంతరం పోలీసులతో ఉన్న తన ఫొటోను షేర్ చేస్తూ.. "పార్లమెంట్లో నిల్చుని కొన్ని సమస్యలపై మాట్లాడితే ప్రతిపక్ష నాయకులను జైళ్లలో వేశారు. కొన్నిసార్లు ఇలాంటి చర్యలు హింసాత్మక ధోరణిలో జరుగుతాయి." అని అన్నారు.
'పెగాసస్.. ఆయన ఫోన్లో కాదు మైండ్లోనే ఉంది'
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. రాహల్ విమర్శలను ఖండించారు. "రాహుల్ గాంధీ మళ్లీ విదేశీ గడ్డకు వెళ్లి.. స్వదేశంలోని ప్రభుత్వంపై ఏడుస్తున్నారు. ఆయన మైండ్లోనే పెగాసస్ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ గౌరవం మరింత పెరిగింది. ప్రపంచంలోని పెద్ద పెద్ద నాయకులు ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇటలీ ప్రధానమంత్రి.. భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఏం చెప్పారో రాహుల్ గాంధీ వినాలి" అని రాహుల్పై మండిపడ్డారు.