Army Jawan honey trapped: భారత సైన్యానికి చెందిన అత్యంత రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని పాకిస్థాన్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్‌కు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో ఓ సైనికుడిని అరెస్ట్ చేశారు రాజస్థాన్ పోలీసులు. ఆ జవాను.. పాక్ మహిళ వలపు వలలో చిక్కుకున్నట్లు నిఘా విభాగం పోలీసులు గుర్తించారు. నిందితుడు జోధ్‌పుర్‌లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్.. ప్రదీప్ కుమార్ అని తెలిపారు.
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన మహిళా ఏజెంట్‌తో ప్రదీప్.. కాంటాక్ట్‌లో ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొద్దిరోజుల పాటు నిఘా వేసిన తర్వాత సైనికుడిని అరెస్ట్ చేశామన్నారు. పాక్ మహిళతో ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా టచ్‌లో ఉన్నాడని, భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆమెతో షేర్ చేసుకున్నట్లు గుర్తించామన్నారు. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్,1923 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసి.. తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
" మే 18న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్ కుమార్ మూడేళ్ల క్రితమే సైన్యంలో చేరాడు. ఆరు నెలల క్రితం ఆ మహిళ నుంచి జవాన్‌కు ఫోన్ వచ్చింది. తాను బెంగళూరులోని ఆర్మీ నర్సింగ్ సర్వీస్ సిబ్బందిగా పరిచయం చేసుకుంది. పెళ్లి చేసుకుందామని, అంతకుముందు దిల్లీలో కలుద్దామని ప్రదీప్‌ను నమ్మించింది. ఆమె వలలో చిక్కుకున్నట్లు నిర్ధరించుకున్న తర్వాత రహస్య సమాచారానికి సంబంధించిన పత్రాలను సామాజిక మాధ్యమాల వేదికగా తీసుకుంది."
- నిఘా విభాగం ఉన్నతాధికారి.
ఇదీ చూడండి: వలపు వలలో చిక్కి దేశ సమాచారం లీక్.. వాయుసేన అధికారి అరెస్ట్!