ఉత్తర్‌ప్రదేశ్‌లో దాడి ఘటనకు సంబంధించిన వీడియో కేసులో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఘజియాబాద్ పోలీసులు జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. యూపీ పోలీసులు మనీశ్‌ను ప్రశ్నించాలనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని.. లేదంటే ఆయన నివాసానికి/కార్యాలయానికి వెళ్లాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇటీవల ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ట్విట్టర్‌లో వైరల్ అయ్యాయి. అయితే, వాస్తవాలను కప్పిపుచ్చి ఆ వీడియోల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. దీంతో ఆ పోస్టులపై ట్విట్టర్, ట్విట్టర్ కమ్యూనికేషన్ ఇండియాపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు.
ఘజియాబాద్ పోలీసుల నోటీసులపై బెంగళూరు వాసి అయిన మనీశ్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వీడియోకు సంబంధించిన కేసులో తనను తొలుత సాక్షిగా పేర్కొంటూ నోటీసులు ఇచ్చారని, రెండురోజుల తర్వాత నిందితుడిగా మార్చారని పేర్కొన్నారు. ఎవరో వీడియో అప్‌లోడ్ చేస్తే తనను నిందితుడిగా పేర్కొన్నారని తెలిపారు. ఈ మెయిల్ ద్వారా సమన్లు పంపించి.. వారంలోగా ఘజియాబాద్‌కు రావాలని సూచించారని పేర్కొన్నారు. తాను ఆన్‌లైన్‌లో విచారణకు హాజరవుతానని చెప్పినా నేరుగా రావాలని పోలీసులు సూచించినట్లు మనీశ్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా మరోసారి విచారణ జరిపిన హైకోర్టు నోటీసులను కొట్టివేసింది. దురుద్దేశపూర్వకంగానే ఈ నోటీసులు జారీ అయినట్లు కన్పిస్తోందన్న న్యాయస్థానం.. పోలీసులు తమ చట్టపరమైన అధికారాలతో వేధింపులకు పాల్పడటాన్ని కోర్టు ఎన్నటికీ అనుమతించబోదని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: