భార్యపై ఎలాంటి భావోద్వేగ బంధం లేకుండా ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక మాత్రమే ఇష్టం పెంచుకున్న భర్త.. ఆమె పట్ల మానసికంగా క్రూరంగా వ్యవహరించినట్లేనని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి భర్తకు భార్య విడాకులు ఇవ్వడం సబబేనంటూ విడాకులు మంజూరు చేసింది.
సాధారణంగా పెళ్లయిన మహిళల్లో ప్రతి ఒక్కరూ (divorce in india law) కుటుంబాన్ని నెలకొల్పుకోవాలని కోరుకుంటారనీ, తమ పరిశీలనకు వచ్చిన కేసులో మాత్రం భర్తకు ఆ బంధాన్ని నిలబెట్టుకోవడంపై ఆసక్తి లేకపోగా అర్థాంగి తెచ్చి ఇచ్చే జీతంపైనే దృష్టి ఉందని పేర్కొంది. విడాకుల కోసం భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు కొట్టివేసింది. నిరుద్యోగి, తాగుబోతు అయిన భర్త తనపై దౌర్జన్యం చేయడంతో పాటు డబ్బు డిమాండ్ చేస్తున్నారని భార్య ఆరోపిస్తూ విడాకులు కోరింది. వివాహం అయిన నాటికి ఆమె వయసు 13 ఏళ్లు కాగా, భర్త వయసు 19 ఏళ్లు. మైనారిటీ తీరిన తర్వాత కూడా భార్యను అత్తవారింటికి తీసుకువెళ్లకపోగా 2014 నవంబరులో ఆమెకు దిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగం లభించాకే ఆ పని చేశారని జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ జస్మీత్ సింగ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాను చదివించడం వల్లనే భార్యకు ఉద్యోగం వచ్చిందని, అందువల్ల విడాకులు ఇవ్వొద్దని భర్త వాదించారు. 2014 వరకు ఆమె తన తల్లిదండ్రుల వద్దనే ఉన్నందువల్ల ఈ వాదనలో పస లేదని కోర్టు తోసిపుచ్చింది.