Foetus In Foetu Stomach : 13 నెలల చిన్నారి కడుపులో నుంచి కిలోన్నర బరువున్న పిండాన్ని శస్త్రచికిత్స చేసి విజయవంతంగా తొలగించారు ఉత్తర్‌ప్రదేశ్ వైద్యులు. చిన్నారి కడుపులోని పిండం.. పెద్ద సిర, ధమని, ఎడమ మూత్రపిండం, ఎడమ ఊపిరితిత్తుల పొరకు అంటుకుని ఉందని లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ వైద్యులు తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
లఖ్‌నవూలోని సిద్ధార్థ్‌నగర్‌కు చెందిన షాజాద్ ఆలం, రహీమా దంపతులకు 13 నెలల కుమార్తె ఉంది. గత ఐదు నెలలుగా ఆ చిన్నారి కడుపు వాపుతో బాధపడుతోంది. ఈ క్రమంలో చిన్నారి తల్లిదండ్రులు ఆందోళనకు గురై.. పలు ఆస్పత్రులకు తిప్పినా ప్రయోజనం లేకపోయింది. ఆఖరికి చిన్నారి ఏమీ తినలేని, తాగలేని పరిస్థితికి చేరుకుంది. అలాగే క్రమంగా బరువు కూడా తగ్గిపోయింది. చిన్నారి పరిస్థితి అంతకంతకు విషమించడం వల్ల.. ఆమె తల్లిదండ్రులు లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించారు.
ఆ ఆస్పత్రిలో చిన్నారిని పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్ జేడీ రావత్ బృందం పరిశీలించి.. వైద్య పరీక్షలు నిర్వహించింది. బాలిక కడుపులో పెద్ద సిర, ధమని, ఎడమ కిడ్నీ, ఎడమ ఊపిరితిత్తుల పొరకు అతుక్కుని పిండం ఉన్నట్లు గుర్తించింది. వెంటనే ప్రొఫెసర్ జేడీ రావత్ నేతృత్వంలోని వైద్య బృందం మూడు గంటలు శ్రమించి బాలికకు కడుపులో ఉన్న కిలోన్నర పిండాన్ని తొలగించింది.
'ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆపరేషన్‌కు 3 గంటల సమయం పట్టింది. బాలికకు వచ్చిన వ్యాధిని ఫీటస్ ఇన్ ఫీటూ అంటారు. ఇదొక అరుదైన వ్యాధి.' అని ప్రొఫెసర్ జేడీ రావత్ తెలిపారు. మరోవైపు.. తమ కుమార్తెకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించడం పట్ల ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
2Kg Foetus In 7 Month Old Boy Stomach : కొద్ది రోజుల క్రితం ఏడు నెలల బాలుడి కడుపులో నుంచి ఆరు నెలల వయసు పిండాన్ని విజయవంతంగా తొలగించారు ఉత్తర్‌ప్రదేశ్ వైద్యులు. దాదాపు రెండు కిలోల బరువున్న పిండాన్ని.. ఆపరేషన్‌ను చేసి బయటకు తీశారు. వింత సమస్యతో బాధపడుతున్న చిన్నారికి అపాయం తప్పించారు. ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సరోజినీ నాయుడు చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు.. ఈ అరుదైన ఆపరేషన్ చేశారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.