భారత్‌లో నివసించే ప్రతిఒక్కరూ హిందువులేనని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "భారత్‌ను తమ మాతృభూమిగా భావించి, ఇక్కడి భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతితో కలిసి జీవించాలనుకునేవారి కులం ఏదైనా, ఏ మతాన్ని అనుసరిస్తున్నా,వారు మాట్లాడే భాష వేరైనా, ఆహారపు అలవాట్లు, సిద్ధాంతాల్లో వ్యత్యాసం ఉన్నా వారంతా హిందువులే. ఇదే విషయాన్ని 1925 నుంచి ఆర్‌ఎస్‌ఎస్ చెబుతోంది" అని అన్నారు.
ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడమే హిందూత్వ సిద్ధాంతమన్న భాగవత్.. వేల సంవత్సరాలుగా భారత్ ఇదే భిన్నత్వాన్ని చాటుతోందని తెలిపారు. "40వేల సంవత్సరాల క్రితం అఖండ భారత్‌లో భాగమైన అందరి డీఎన్‌ఏ ఒక్కటే. ప్రతిఒక్కరూ తమ సంస్కృతి, సంప్రదాయాలను తప్పక పాటించాలని పూర్వీకులు మనకు నేర్పించారు. ఇతరుల విశ్వసాలు, సంప్రదాయాలను మనమంతా గౌరవించాలి. సొంత లక్ష్యాలను సాధించుకోవడం కోసం ఇతరుల సంపదను దోచుకోవద్దు" అని హితవుపలికారు.
కరోనా సమయంలో దేశమంతా కలిసి పోరాడిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సంస్కృతే అందర్ని ఒక్కటిగా చేస్తుందనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. మన మధ్య ఎన్ని వ్యత్యాసాలున్నా, క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కటిగా నిలిచి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని భాగవత్ వ్యాఖ్యానించారు.