Empty Liquor bottles at assembly: బిహార్ శాసనసభ ప్రాంగణంలో ఖాళీ లిక్కర్ బాటిళ్లు దర్శనమివ్వడం వివాదాస్పదమైంది. టూవీలర్ల కోసం కేటాయించిన పార్కింగ్ ప్రదేశంలో ఓ చెట్టు కింద ఈ సీసాలు కనిపించాయి. ఇటీవల కల్తీ మద్యంతో 40 మందికి పైగా మృతి చెందిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఇవి కనిపించడం వల్ల.. సభలో వివాదానికి తెరలేచింది.
Bihar Assembly news: ఖాళీ మద్యం సీసాల విషయంపై విపక్షనేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఛాంబర్‌కు వంద మీటర్ల దూరంలో మద్యం సీసాలు కనిపించడం దారుణమని అన్నారు. సీసాలు ఉన్న ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ఎమ్మెల్యేలు మద్యపానానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన 24 గంటల వ్యవధిలోనే సీసాలు కనిపించాయని ఎద్దేవా చేశారు.
"నిన్ననే ముఖ్యమంత్రి ఎన్డీఏ చట్టసభ్యులతో సమావేశమయ్యారు. ఇక్కడే.. సెంట్రల్ హాలులో వారితో మద్యపానానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. 24 గంటల తర్వాత అదే ప్రాంతంలో మద్యం సీసాలు కనిపించాయి."
-తేజస్వీ యాదవ్, బిహార్ విపక్ష నేత
మద్యపాన నిషేధానికి తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు తేజస్వీ యాదవ్. కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నారంటూ ఆర్జేడీ నేతలపై అధికార పక్షం చేస్తున్న ఆరోపణలపై స్పందించిన ఆయన... 'అసెంబ్లీ ఆవరణలో ఖాళీ సీసాలు సైతం ఆర్జేడీ నేతలే పెట్టారని చెప్పినా ఆశ్చర్యం అక్కర్లేదు' అని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో రగడ
భోజన విరామం తర్వాత తిరిగి సమావేశమైన అసెంబ్లీలో ఖాళీ మద్యం సీసాల అంశంపై విపక్షాలు మండిపడ్డాయి. అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ముఖ్యమంత్రి దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి.
కఠిన శిక్ష తప్పదు
అనంతరం మాట్లాడిన సీఎం నితీశ్ కుమార్.. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. కారకులైన వారికి కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ, చీఫ్ సెక్రెటరీని ఆదేశిస్తామని చెప్పారు.
సీఎం సమాధానంపై స్పందించిన తేజస్వీ యాదవ్.. కింది స్థాయి అధికారులను బలి పశువులను చేయొద్దని అన్నారు. పెద్దవారు తప్పించుకుంటున్నారని ఆరోపించారు.
మద్యపానంపై నిషేధం...
బిహార్‌లో 2016 నుంచి మద్యపానంపై నిషేధం కొనసాగుతోంది. 2015లో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఈ నిషేధాన్ని అమలులోకి తెచ్చారు సీఎం నితీశ్ కుమార్. అయితే, రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ధనవంతులు మద్యాన్ని తమ ఇంటి వద్దకు కూడా తెప్పించుకుంటున్నారని, ప్రభుత్వ నిర్ణయాలు పేదవారికి శాపంగా మారుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ నిషేధం నేపథ్యంలో కల్తీ మద్యం సైతం రాష్ట్రంలో ఏరులై పారుతోంది. మద్యం దొరకని పరిస్థితుల్లో కల్తీ వెంట పరుగులు తీస్తున్నారు జనం. గత నెలలో పశ్చిమ చంపారన్, గోపాల్‌గంజ్, ముజఫర్‌పుర్, సమస్తీపుర్ జిల్లాల్లో 45 మందికి పైగా ప్రజలు కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: సంక్షేమ రాజ్యంలో 'మందు'పాతరలా?