Inter Marks Weightage Canceled in TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌లో.. ఈ ఏడాది నుంచి ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు.. గతంలో ఇచ్చిన జీవోను సవరిస్తూ తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ.. బుధవారం జీవో 18ను జారీ చేశారు. ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఎంసెట్ పరీక్షకు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతుండగా.. ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలు విడుదల చేయకపోవడం, ఎంసెట్ అధికారులకు అందజేయకపోవడం వల్ల... ఎంసెట్ ఫలితాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇలాంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్ వెయిటేజీని రద్దు చేసింది.
ఆ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్ స్కోరు..: ఇప్పటివరకు.. ఎంసెట్ మార్కలకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ‌్జెక్టులకు అంటే.. 600 మార్కులకు 25 శాతం వెయిటేజీని ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్‌లో స్కోర్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నారు. జేఈఈ మెయిన్స్, నీట్‌లలోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీని అధికారులు ఎత్తివేశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా 2020-2022 మధ్య జరిగిన ఎంసెట్ పరీక్షలలో ఇంటర్ వెయిటేజీని విద్యాశాఖ అధికారులు ఎత్తివేశారు. విద్యాశాఖ ఈసారి దానిని శాశ్వతంగా రద్దు చేస్తూ... గతంలోని జీవోను సవరిస్తూ తాజాగా జీవో 18ను జారీ చేశారు.
Changes in Telangana EAMCET Exam Schedule: తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో అధికారులు మార్పులు చేసిన విషయం తెలిసిందే. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఇంజినీరింగ్ ఎగ్జామ్‌లను తెలంగాణలో మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు విద్యామండలి ప్రకటించింది. నీట్, టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలను దృష్టిలో పెట్టుకుని పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేసినట్టుగా పేర్కొంది.
ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు: అయితే ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను మే 10, 11 తేదీల్లో యథాతథంగా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. దరఖాస్తుల గడువు కాలం ఏప్రిల్ 4తో ముగియగా... ఆలస్య రుసుము చెల్లింపులతో మే 2 వరకు ఈ ఎంసెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
ఇవీ చదవండి: