Delhi Liquor scam: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో పలు అరెస్టులు కొనసాగుతున్నాయి. మనీలాండరింగ్ అభియోగాల కింద బుధవారం ఉదయం ఈడీ.. మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రును అరెస్టు చేసింది. ఈ కేసులో రాత్రి మొత్తం ప్రశ్నించిన అనంతరం ఆయన్ను కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం సమీర్.. ఇండోస్పిరిట్స్ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. దిల్లీ డిప్యూటీ సీఎం సిసోదియా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన సన్నిహితుడు విజయ్ నాయర్‌ను మంగళవారం సీబీఐ అరెస్టు చేసింది. ఈ పరిణామాలు భాజపా, ఆప్ మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఇదంతా ఆప్‌ను నిలువరించేందుకు కాషాయ పార్టీ చేస్తున్న కుటిలయత్నమని ఆప్ మండిపడుతోంది.
కొత్త ఎక్సైజ్ విధానంలో.. కొన్ని లోపాలు ఉన్నాయని, టెండర్ల జారీ తర్వాత మద్యం లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా దీన్ని తయారుచేశారని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలో ఓ నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా ఈ విధానంపై దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐకి గతంలో సిఫార్సు చేశారు. నూతన మద్యం విధానంలో చోటుచేసుకున్న నియమాల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు మద్యం లైసెన్సుల మంజూరులో అవకతవకలకు పాల్పడారన్న ఆరోణలతో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాను సీబీఐ నిందితుడిగా చేర్చింది. మరోవైపు, విపక్షాల నుంచి విమర్శలు ఎదురైన నేపథ్యంలో గత నవంబర్‌లో ఈ విధానంపై ఆప్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.