దేశంలో టీకా పంపిణీ 100కోట్ల మార్కును (100 Crore Vaccine) దాటింది. ఈ నేపథ్యంలో గుజరాత్ సూరత్‌కు చెందిన ఓ చిరుతిళ్ల వ్యాపారి కస్టమర్లకు మంచి ఆఫర్ ఇచ్చారు. స్థానిక వంటకమైన 'లోచో'ను.. రెండు డోసులు పూర్తి చేసుకున్న మొదటి 100 మందికి ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్‌ను మరో రెండు రోజుల పాటు కొనసాగిస్తానని తెలిపారు.
"భారత్‌లో టీకా పంపిణీ 100 కోట్ల మార్కును దాటింది. ఇందులో ప్రజల భాగస్వామ్యమే ప్రధానం. అందుకే పూర్తిస్థాయిలో టీకా తీసుకున్న వారికి నా దుకాణంలో చేసే లోచోను ఉచితంగా ఇస్తున్నాను. ఈ ఆఫర్ మరో రెండు రోజుల వరకు ఉంటుంది. మొదటి వంద మందికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రజల్లో టీకాపై అవగాహన మరింత పెరగుతుందని భావిస్తున్నాను."
-మోహిత్, దుకాణాదారుడు
విదేశాల్లో టీకాపై అవగాహన కల్పించేందుకు అక్కడి ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు నగదు ప్రోత్సాహాన్ని, డిస్కౌంట్లను, ఆఫర్లను ఇస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్ ప్రస్తుతం అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగా ఉన్న భారత్‌లో ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. టీకా వేసుకుంటే.. ఎఫ్డీలపై అధిక వడ్డీని చెల్లించనున్నట్లు అనేక బ్యాంకులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌కు చెందిన మోహిత్ అనే చిరుతిళ్ల వ్యాపారి తనకు తోచిన విధంగా ఈ ఫూడ్ ఆఫర్లను ప్రకటించారు.
దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సిన్ల పంపిణీ.. శరవేగంగా 100కోట్ల మైలురాయిని అందుకుంది. గురువారం ఈ ఘనత సాధించింది.
ఇదీ చూడండి: 'టీకా వంద కోట్ల మైలురాయి.. నవభారతానికి ప్రతీక'