DMK woman Councilor suicide : తమిళనాడు సమక్కల్ జిల్లాలో డీఎంకే మహిళా కౌన్సిలర్ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను రాశిపురం 13వ వార్డు కౌన్సిలర్ దేవిప్రియ(43), ఆమె భర్త అరుణ్‌లాల్(51), కుమార్తె(16)గా పోలీసులు గుర్తించారు. అప్పుల కారణంగానే మహిళా కౌన్సిలర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
'మహిళా కౌన్సిలర్ భర్త అరుణ్‌లాల్.. రాశిపురంలో నగల దుకాణం నడుపుతున్నారు. ఆ దుకాణంలో పనిచేసే ఓ యువకుడు సెలవు తీసుకుంటానని చెప్పడం కోసం అరుణ్లాల్కు ఫోన్ చేసినా స్పందించలేదు. అతడి భార్య దేవిప్రియకు కాల్ చేసినా.. ఆమె కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆఖరికి అరుణాలాల్ పక్కింటివారికి ఫోన్ చేసి.. తాను బుధవారం సెలవు తీసుకుంటామని చెప్పమన్నాడు యువకుడు. దీంతో అరుణాలాల్ పక్కింటివారు వెళ్లి చూడగా.. ముగ్గురు కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే మాకు స్థానికులు సమాచారం అందించారు. కౌన్సిలర్ సహా ఆమె భర్త, కుమార్తె మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం రాశిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాం' అని పోలీసులు తెలిపారు.
పెళ్లికి నిరాకరించారని..
టెలిగ్రాం స్నేహితుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని అపార్ట్మెంట్లోని రెండో అంతస్తు నుంచి దూకేసింది 24 ఏళ్ల యువతి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాలో బుధవారం జరిగింది.
అసలేం జరిగిందంటే..
నొయిడాకు చెందిన యువతి ఎంబీఏ చదువుతోంది. ఆమెకు ఉత్తర్‌ప్రదేశ్ బదాయూ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడు టెలిగ్రామ్ యాప్‌లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యలకు తెలియడం వల్ల వారు పెళ్లికి నిరాకరించారు. యువతి ఫోన్ సైతం లాక్కున్నారు. ఈ క్రమంలో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. యువతి కుటుంబ సభ్యులు ఉన్న అపార్ట్మెంట్లోని రెండో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. వెంటనే యువతి కుటుంబ సభ్యులు.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.