Cyber fraud: సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తూ జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. వారి మాయమాటలు నమ్మి ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తీరా మోసపోయామని గ్రహించాక.. చేసేదేం లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కర్ణాటక బెంగళూరులో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఓ డాక్టర్ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కి ఆయన తన తండ్రి ప్రాణాలను పోగొట్టుకున్నారు.
అసలేమైందంటే..?
Black fungus vaccine cyber fraud: కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో.. బ్లాక్ ఫంగస్ బాధితుల కేసులు భారీగానే నమోదయ్యాయి. చాలామంది ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చింది. బెంగళూరుకు చెందిన వైద్యుడు మహేశ్ తండ్రి కూడా బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఈ వ్యాధికి చికిత్స కోసం ఆన్లైన్లో వెతకగా మహేశ్‌కు పంజాబ్ లుథియానాకు చెందిన రోహన్ చౌహాన్ అనే వ్యక్తి వద్ద వ్యాక్సిన్లు ఉన్నాయనే సమాచారం కనిపించింది. దాంతో అతని వద్ద నుంచి 50 వ్యాక్సిన్లను ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. ఇందుకోసం రెండు వాయిదాల్లో రూ.3.65 లక్షలను రోహన్ సూచించిన ఖాతాకు ఆన్లైన్లో పంపించారు.
విప్పి చూస్తే చెప్పులు..
చెప్పిన సమయానికే వ్యాక్సిన్ డీలర్ నుంచి మహేశ్‌కు డెలివరీ అందింది. అయితే.. ఆ పార్సిల్‌ను విప్పి చూశాక కంగుతినడం డాక్టర్ మహేశ్ వంతైంది. ఎందుకంటే.. ఆ పార్సిల్లో వ్యాక్సిన్లకు బదులుగా రెండు జతల చెప్పులు ఉన్నాయి. అయితే.. డెలివరీలో ఏదో పొరపాటు ఉంటుందని భావించిన మహేశ్.. డీలర్ రోహన్‌కు ఫోన్ చేయాలని ప్రయత్నించారు. కానీ, ఆ తర్వాత ఫోన్ చేస్తే అటువైపు నుంచి సమాధానం లేదు. దాంతో తాను మోసపోయానని గ్రహించారు మహేశ్.
ఇదీ చూడండి: ఫోన్ కొట్టేశాడని.. పడవలో తలకిందులుగా వేలాడదీసి..
ఫొటోలతో నమ్మించి...
Doctor loses father in cyber fraud: మహేశ్ తండ్రికి బ్లాక్ ఫంగస్ చికిత్సకుగాను అత్యవసరంగా ఇంజెక్షన్లు కావాల్సి ఉండడం వల్లే... పెద్దగా ఆరా తీయకుండానే డీలర్ రోహన్ సూచించిన ఖాతాకు తొలుత అతడు రూ.10,000 పంపారు. ఆ తర్వాత తనకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నట్లు నమ్మించేందుకు సదరు డీలర్.. బిల్లు, పార్సిల్ వంటి వివరాల ఫొటోలను మహేశ్‌కు పంపాడు. వాటిని చూసి, నిజమేనని నమ్మిన మహేశ్.. రోహన్ ఖాతాకు మిగతా డబ్బులను కూడా పంపించారు. ఆఖరుకు పార్సిల్లో వ్యాక్సిన్లు కాకుండా.. చెప్పులు రాగా సమయానికి మహేశ్ తన తండ్రికి చికిత్స అందించలేకపోయారు. దాంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: ఆర్టీఐ కార్యకర్తపై దుండగుల దాడి.. కాళ్లకు మేకులు దింపి...
Punjab ludhiana cyber crimes: ఆరు నెలల తర్వాత.. తనకు జరిగిన మోసంపై లుథియానాలో తబ్రి పోలీస్ స్టేషన్లో బాధితుడు మహేశ్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై తాము ప్రత్యేక దృష్టి సారించామని లుథియానా సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ జతీందర్ సింగ్ తెలిపారు.
"దేశంలో రోజూ సైబర్ నేరాలకు గురయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. క్రెడిట్‌కార్డులు, లాటరీ, బ్యాంక్ వివరాలు అప్డేట్, కేవైసీ వంటి పేర్లు చెప్పి సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ప్రతిరోజు దాదాపు 10 మంది సైబర్ నేరాల కేసులు మా వద్ద నమోదవుతున్నాయి. ప్రస్తుతం 400 కేసులను తాము దర్యాప్తు చేస్తున్నాం" అని జతీందర్ సింగ్ తెలిపారు.
సైబర్ నేరాల్లో బాధితులు హెల్ప్‌లైన్ నంబర్లు 155, 260కి కాల్ చేయవచ్చని జతీందర్ సింగ్ తెలిపారు. ఎంత త్వరగా నేరం గురించి తెలియజేస్తే.. బాధితులను పట్టుకోవడం అంత త్వరగా సాధ్యపడుతుందని చెప్పారు. ప్రజలు ఎవరికీ తమ పాస్వర్డ్లు, ఓటీపీలను చెప్పకూడదని సూచించారు.
ఇవీ చూడండి: