Crores of Rupees in Labour Account : కూలీ పనులు చేసుకొని జీవించే ఓ వ్యక్తి ఖాతాలోకి కోట్ల రూపాయలు వచ్చి చేరడం సంచలనమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ డబ్బుల విషయంపై ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చేంత వరకు ఖాతాలోని నగదు గురించి అతడికి తెలియదు. వివరాల్లోకి వెళ్తే.. లాల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బతానియా గ్రామానికి చెందిన శివ ప్రసాద్ నిషాద్.. దిల్లీలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవల అతడి ఖాతాలో ఒక్కసారిగా రూ.221.30 కోట్లు జమ అయ్యాయి. తన ఖాతాలో అన్ని డబ్బులు ఉన్న విషయం శివ ప్రసాద్‌కు తెలియదు.
అయితే, ఆ డబ్బు విషయంపై ఆదాయపు పన్ను శాఖ అతడికి నోటీసులు జారీ చేసింది. అప్పుడు గానీ తన ఖాతాలో అంత డబ్బు ఉన్న విషయం అతడికి తెలియలేదు. దీంతో ఆశ్చర్యపోయిన శివ ప్రసాద్.. వెంటనే దిల్లీ నుంచి బయల్దేరి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఖాతాలో రూ.221.30 కోట్ల డబ్బు ఉందని ఐటీ శాఖ.. నోటీసుల్లో పేర్కొంది. అందులో నుంచి రూ.4.58 లక్షలు టీడీఎస్ కింద కట్ అయినట్లు తెలిపింది. నిర్మాణ పనుల చెల్లింపుల్లో భాగంగా ఈ లావాదేవీ జరిగినట్లు పేర్కొంది.
అయితే, కూలీగా పనిచేసే శివప్రసాద్‌కు ఇవేవీ అర్థం కాలేదు. ఆ డబ్బు ఎందుకు వచ్చింది, ఆ లావాదేవీలు ఏంటనే వివరాలేవీ అర్థం చేసుకోలేకపోయాడు. అయితే, అప్పుడే ఓ విషయం అతడికి గుర్తుకొచ్చింది. 2019లో శివ ప్రసాద్ తన పాన్ కార్డు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు అదే కారణం అయి ఉండొచ్చని భావించాడు. ఎవరైనా తన పాన్ కార్డుతో నకిలీ లావాదేవీలు నిర్వహించి ఉండొచ్చని అనుమానిస్తున్నాడు. ఇదే విషయంపై లాల్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై బ్యాంకు ఉన్నతాధికారులను సైతం సంప్రదించాడు.
ఖాతాలోకి రూ.753 కోట్లు...
ఇటీవల ఇలాగే.. ఖాతాలోకి రూ.753 కోట్లు వచ్చినట్లు ఓ వ్యక్తికి సందేశం వచ్చింది. దీన్ని చూసిన అతడు బ్యాంకు అధికారుల వద్దకు పరిగెత్తాడు. వెంటనే అతడి ఖాతాను నిలిపివేశారు బ్యాంకు అధికారులు. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
బ్యాంకు ఖాతాలోకి రూ.6,833 కోట్లు.. అధికారుల మౌనం!.. ఇప్పటికీ అకౌంట్లోనే డబ్బు
3 ఖాతాల్లో రూ.1.28 కోట్లు జమ.. నాలుగు నెలల తర్వాత మేల్కొన్న బ్యాంక్ అధికారులు!