భాజపా నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న విమర్శలను భారత్ తిప్పికొట్టింది. భారత్‌లోని ముస్లింల హక్కులను కాపాడేలా ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలంటూ ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) చేసిన ప్రకటన.. అసమంజసంగా, సంకుచితంగా ఉందని విదేశాంగ శాఖ మండిపడింది. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన గౌరవం లభిస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
"మతపరమైన వ్యక్తులను కించపరుస్తూ కొందరు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి. అవి భారత ప్రభుత్వ అభిప్రాయాలు కానేకావు. ఆ వ్యక్తులపై సంబంధిత సంస్థ(భాజపా) ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఓఐసీ సెక్రెటేరియట్ మరోసారి తప్పుదోప పట్టించే వ్యాఖ్యలు చేయడం విచారకరం. స్వార్థ ప్రయోజనాల వల్లే ఈ విభజనపూరిత అజెండాను ప్రదర్శిస్తున్నారని ఇది స్పష్టం చేస్తోంది. ఓఐసీ సెక్రెటేరియట్ మతపరమైన విధానాలను పక్కనబెట్టి, అన్ని విశ్వాసాలను గౌరవించాలని కోరుకుంటున్నాం."
-అరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి
మరోవైపు, వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ సౌదీ అరేబియా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఖతర్, ఇరాన్, కువైట్ దేశాలు ఈ వ్యవహారాన్ని ఖండించగా.. అన్ని వర్గాలను, విశ్వాసాలను గౌరవించాలంటూ తాజాగా సౌదీ పేర్కొంది. అదే సమయంలో, భారతీయ జనతా పార్టీ తీసుకున్న చర్యలను స్వాగతించింది.
Pakistan India news: ఇదిలా ఉంటే, పాకిస్థాన్ ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ భారత దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌లోని ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలను దెబ్బతీశాయని వ్యాఖ్యానించింది. అయితే, దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఎన్నో ఏళ్ల నుంచి మైనారిటీ హక్కులను కాలరాస్తున్న దేశం.. మరో దేశంలోని మైనారిటీల వ్యవహారాలపై మాట్లాడటం అసంబద్ధంగా ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది.
'హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, అహ్మదీయులపై పాకిస్థాన్ చేపట్టిన వ్యవస్థీకృత అణచివేతను ప్రపంచం మొత్తం చూస్తోంది. భారత ప్రభుత్వం అన్ని మతాలకు తగిన గౌరవం ఇస్తుంది. మా దేశం... పాకిస్థాన్‌లా మతోన్మాదులను పొగుడుతూ, వారికి స్మారకాలు కట్టే దేశం కాదు' అని స్పష్టం చేసింది. ముందుగా తమ దేశంలో శాంతి, భద్రతల పరిస్థితులపై, అక్కడి మైనారిటీల సంక్షేమంపై దృష్టిసారించాలని పాకిస్థాన్‌కు హితవు పలికింది. భారత్‌లో మతపరమైన కల్లోలాలు సృష్టించేందుకు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితబోధ చేసింది.
Nupur Sharma controversy: మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధులు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌పై భాజపా చర్యలు తీసుకుంది. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఆందోళనలకు దారి తీశాయనే కారణంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు.. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మతసామరస్యం దెబ్బతినేందుకు కారణమవుతున్నారని, పార్టీ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించారనే కారణంతో పార్టీ దిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.
ఇదీ చదవండి: 'మన కరెన్సీ, బ్యాంకులను 'అంతర్జాతీయం' చేద్దాం'