దిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత 'హక్కులకు భంగం కలగకుండా' తనకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు రాహుల్ గాంధీ. ఈ విషయాన్ని లేఖ ద్వారా పార్లమెంట్‌లోని లోక్‌సభ సెక్రటేరియట్ అధికారులకు తెలియజేశారు. నాలుగుసార్లు లోకసభ సభ్యుడిగా ఎన్నికైన విషయాన్ని లేఖలో రాహుల్ గుర్తు చేశారు. ఈ కాలంలో తనకు కేటాయించిన బంగ్లాతో ఉన్న అనుబంధాన్ని, తీపి గుర్తులు మరచిపోలేనని ఆయన తెలిపారు.
దిల్లీ తుగ్లక్ లేన్‌లోని 12వ నంబర్ బంగ్లా ఖాళీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ లేఖ ద్వారా తెలిపారు. " నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాను. ఇది ప్రజల ఆదేశం. నేను ఇక్కడ గడిపిన సంతోషకరమైన జ్ఞాపకాలకు జీవితంలో మరచిపోలేను. నా హక్కులకు భంగం కలగకుండా, మీ లేఖలో ఉన్న వివరాలకు నేను కట్టుబడి ఉంటాను" అని లోక్‌సభ సెక్రటేరియట్ అధికారులకు లేఖ రాశారు. దీంతోపాటుగా లోక్‌సభ సచివాలయ అధికారులు పంపిన లేఖ అందిందని.. అది పంపినందుకు సంతోషం అని ఆ లేఖలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
పరవునష్టం కేసులో కేరళ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే ఆయనపై అనర్హత వేటు పడింది. ఫలితంగా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు అయింది. ఆ తర్వాత ప్రజాప్రతినిధులకు కేటాయించే అధికారిక భవనాన్ని ఏప్రిల్ 22లోగా ఖాళీ చేయాల్సిందిగా రాహుల్‌కు సోమవారం మధ్యాహ్నం నోటీసులు పంపారు పార్లమెంట్ అధికారులు.
లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. 2005 నుంచి దిల్లీలోని తుగ్లక్ లేన్‌లో 12వ నంబరు బంగ్లాలో నివాసం ఉంటున్నారు.
'మా ఇంట్లో ఉంటారు..'
రాహుల్ గాంధీని అధికార భవనాన్ని ఖాళీ చేయాలని కోరడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌ను బెదిరించడానికి, భయపెట్టడానికి, అవమానపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ తన అధికార బంగ్లాను ఖాళీ చేశాక.. తన తల్లి సోనియా గాంధీ ఇంట్లో ఉండవచ్చని తెలిపారు. లేదంటే తనకు కేటాయించిన అధికార భవనంలోనైనా వచ్చి ఉండవచ్చని ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీని బలహీన పరచడానికే కేంద్రం ఈ పనులన్నీ చేస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో తాను కూడా 6 నెలల పాటు అధికార భవనం లేకుండా ఉన్నట్లు మల్లికార్జున్ ఖర్గే గుర్తు చేశారు.