కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల దాడి ఉద్ధృతం చేశారు. తనను ఆ పార్టీ ఇప్పటి వరకు 91 సార్లు దూషించిందని ఆరోపించారు. అలా తిట్టిన ప్రతిసారి ఆ పార్టీ కుప్పకూలిపోయిందని విమర్శించారు. కానీ తాను మాత్రం కన్నడ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని హమీ ఇచ్చారు. కర్ణాటక బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
"కాంగ్రెస్ నన్ను మళ్లీ దుర్భాషలాడడం ప్రారంభించింది. నన్ను తిట్టిన ప్రతిసారి కాంగ్రెసే దెబ్బతింటోంది. ఇప్పటివరకు ఆ పార్టీ 91 సార్లు దుర్భాషలాడింది. వారు నన్ను ఎంత తిట్టినా.. కానీ నేను మాత్రం కర్ణాటక ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను. పేదల కష్టాలు, బాధలను కాంగ్రెస్ ఎప్పటికీ అర్థం చేసుకోదు. కాంగ్రెస్ హయాంలో సొంతంటి ఇళ్ల కల చాలామందికి తీరలేదు. కానీ మేము మాత్రం కొన్ని వేల ఇళ్లు కట్టించి.. ప్రజలకు ఉచితంగా అందిచాం. మహిళలను సొంతింటి యజమానులను చేశాం. కాంగ్రెస్ హయాంలో కర్ణాటక నష్టపోయింది. ఆ పార్టీ సీట్ల గురించి మాత్రమే పట్టించుకుంటుంది తప్ప రాష్ట్ర ప్రజల గురించి కాదు. రాష్ట్రంలో అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
"పేదల కోసం, దేశం కోసం పనిచేసే వారిని అవమానించడం కాంగ్రెస్కు అలవాటే. ఇలా దాడి చేసింది నాపై మాత్రమే కాదు.. గత ఎన్నికల్లో చౌకీదార్ చోర్ హై అని ప్రచారం చేశారు. ఆ తర్వాత మోదీ చోర్ అన్నారు. తర్వాత ఓబీసీ కమ్యూనిటీలు చోర్ అన్నారు. ఇప్పుడు కర్ణాటకలో నా లింగాయత్ సోదరులు, సోదరీమణులను చోర్ అంటున్నారు. వాటిన్నంటిని ప్రజలు వింటున్నారు. ఓట్ల ద్వారా ఆ పార్టీకి బుద్ధి చెప్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను దూషించిన ఏకైక పార్టీ కాంగ్రెస్. మీ ఆశీర్వాదంతో వారి దూషణలన్నీ బురదలో కలిసిపోతాయి. మీరు(కాంగ్రెస్) ఎంత బురద చల్లితే.. కమలం అంత వికసిస్తుంది" అని మోదీ విమర్శించారు.
కర్ణాటకలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలు కేవలం ఐదేళ్ల ప్రభుత్వం ఏర్పాటుకు కాదని.. దేశంలో ఆ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం కోసమని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటకలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా సిద్ధమైందని తెలిపారు. కన్నడ రైతులు, ప్రజలకు కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలు మాత్రమే చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే బీజేపీ హయాంలో విదేశీ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయన్నారు. కర్ణాటకలో రెట్టింపు వేగంతో రెండంకెల అభివృద్ధి జరుగుతోందని మోదీ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్రానికి చాలా ముఖ్యమైని తెలిపారు.