CID Two Days interrogation of Chandrababu: నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో (Skill Development Case) చంద్రబాబును.. రెండో రోజూ కస్టడీకి తీసుకున్న సీఐడీ (CID Interrogates Chandrababu Second Day) అధికారులు.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం కాన్ఫరెన్స్ హాలులో విచారించారు. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకూ.. చంద్రబాబు సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పడంతో.. ఇంకా ఏ ప్రశ్నలను అడగాలనేదానిపై వారు మళ్లీ ఫైళ్లు చూసుకున్నారు. సీఐడీ అధికారుల తీరుపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..‘నన్ను ఎక్కడ తప్పుపట్టాలో మీకు తెలియని పరిస్థితి ఉందనేందుకు ఇదే నిదర్శనం..’అని అన్నారు.
రెండేళ్ల కిందటే కేసు నమోదుచేసినా.. తాను తప్పుచేసినట్టు ఇప్పటికీ మీ దగ్గర ఆధారాలు లేవని.. చంద్రబాబు సీఐడీ అధికారులతో అన్నారు. అయినా అరెస్టు చేశారని, 15 రోజులవుతున్నా తప్పుపట్టడానికి మీకు చిన్న ఆస్కారం కూడా లేకుండా పోయిందని చెప్పారు. 45 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న తనను.. నిరాధార కేసులో అరెస్టు చేసి బాధపెట్టడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు. రెండో రోజు.. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన విచారణ.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగింది.
CBN CID Custody ముగిసిన సీఐడీ కస్టడీ... అక్టోబర్ 5 వరకు చంద్రబాబుకు రిమాండ్
- అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. (AP CID Asked Questions to Chandrababu) నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీమెన్స్ సంస్థల మధ్య ఒప్పందం చేసుకునే క్రమంలో ప్రొసీజర్ తప్పుల గురించి.. అధికారులు మీకు చెప్పలేదా అని సీఐడీ ప్రశ్నించింది. అధికారుల సమగ్ర పరిశీలన, ఆమోదం తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకోసం సీమెన్స్‌తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని చంద్రబాబు బదులిచ్చారు. ఈ విషయంలో.. నిబంధనల ప్రకారమే వ్యవహరించామని, ఎక్కడా వాటి అతిక్రమణకు తావే లేదని చెప్పినట్లు.. తెలిసింది.
- నైపుణ్యాభివృద్ధి శిక్షణ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన గురించి.. మీకు అధికారులు చెప్పారా అని సీఐడీ అడిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఏమీ జరగలేదన్న చంద్రబాబు.. అంతా సక్రమంగా జరిగిందన్నారు. అధికారులు కూడా అదే విషయాన్ని నిర్ధారించారని చెప్పారు. సీమెన్స్ సంస్థ ఏపీలోనే కాకుండా.. పలు రాష్ట్రాల్లో ఇదే తరహా ఒప్పందాలు చేసుకుందన్నారు. కేంద్రప్రభుత్వం కూడా.. సీమెన్స్‌తో కలిసి పనిచేసిందన్నారు. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే.. నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశామన్నారు.
- నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణకు ఏర్పాటుచేసిన కమిటీ అన్నీసరిగ్గా చూసిందా లేదా అనేది మీరు పరిశీలించలేదా సీఐడీ అడిగింది. కిందిస్థాయిలో కమిటీల పనితీరు, విధి నిర్వహణల విషయాన్ని.. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చూడరని చంద్రబాబు.. చెప్పారు. ఆ శాఖలోని ఉన్నతాధికారులు, కార్యదర్శులు, కార్పొరేషన్ అధికారులు.. ఆ బాధ్యతలు చూస్తారని చెప్పినట్లు తెలిసింది.
- ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి అపర్ణను మీరు తీసుకొచ్చారట కదా అని.. సీఐడీ ప్రశ్నించింది. మీ వాదన సరికాదని చంద్రబాబు అన్నారు. ఆమె డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా నిబంధనల ప్రకారం సీఎస్ ఆమోదించారని.. కేంద్రం కూడా ఆమోదించిందని వివరించారు. ఫైళ్లు చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయని.. చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
- అపర్ణ భర్త డిజైన్‌టెక్‌లో ఉద్యోగిగా ఉన్న విషయం మీకు తెలుసా అని.. సీఐడీ ప్రశ్నించింది. ఆ విషయం తనకు తెలీదని.. చంద్రబాబు చెప్పారు. ఒకవేళ ఆమె భర్త డిజైన్‌టెక్‌లో పనిచేస్తుంటే.. ఆ విషయాన్ని అపర్ణే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు.
- తెలుగుదేశానికి విరాళాలు ఎలా వస్తాయని.. సీఐడీ ప్రశ్నించింది. అక్రమ సొమ్మును తెలుగుదేశం ఎప్పుడూ విరాళంగా స్వీకరించదని.. చంద్రబాబు చెప్పారు. తమకు వచ్చే పార్టీఫండ్ అంతా అత్యంత పారదర్శకంగా ఉంటుందన్నారు.
రెండో రోజు చంద్రబాబును విచారించేందుకు.. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఉదయం 8.39 గంటలకే జైలు ప్రాంగణానికి చేరుకుంది. ఆ తర్వాత.. చంద్రబాబు తరఫు న్యాయవాది లోపలికి వెళ్లారు. సాయంత్రం 5.47 సమయంలో.. సీఐడీ అధికారులు విచారణను ముగించుకుని బయటకి వచ్చారు.