చైనాతో సరిహద్దు వివాదంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలతో తమకు ఎలాంటి సమస్యా లేదని.. అయితే, సైన్యాన్ని ఎవరూ అగౌరవపర్చకూడదని అన్నారు. చైనా వ్యవహారంలో తాము ఉదాసీనంగా ప్రవర్తించడం లేదని స్పష్టం చేశారు. వారిపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని అన్నారు. డ్రాగన్ సమస్యను విదేశాంగ మంత్రి లోతుగా అర్థం చేసుకోవాలంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"నేను లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ నాకు సలహా ఇచ్చారు. ఈ సలహా ఎవరి నుంచి వచ్చిందో తెలిసిన తర్వాత.. ఆయనకు వంగి నమస్కరించడం తప్ప ఏమీ చేయలేను. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సైన్యాన్ని విమర్శించకూడదు. మన సైనికులు సరిహద్దులో 13వేల అడుగుల ఎత్తున పహారా కాస్తున్నారు. వారికి గౌరవం ఇవ్వాలి. చైనా పట్ల మేం నిర్లక్ష్యం వ్యక్తం చేయలేదు. ఉద్రిక్తతల సమయంలో భారత సైన్యాన్ని సరిహద్దుకు ఎవరు పంపారు? సరిహద్దులో సాధారణ పరిస్థితి కోసం ఎవరు ఒత్తిడి తెస్తున్నారు? చైనాతో మన సంబంధాలు సాధారణంగా లేవని ఎవరు ఒత్తిడి తెస్తున్నారు?"
-జైశంకర్, విదేశాంగ మంత్రి
అంతకుముందు, చైనా అంశంపై పార్లమెంట్లో డిబేట్ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. చైనా చొరబాట్లపై చర్చించాలని రూల్ 267 కింద 9 నోటీసులు ఇవ్వగా.. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. అయినాసరే మిగిలిన అంశాలను పక్కన పెట్టి చర్చించాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబట్టింది. 'దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. వారు మన భూమిని ఆక్రమిస్తున్నారు. మనం ఈ సమస్యపై కాకుండా.. ఇంకేం చర్చిస్తాం?' అంటూ రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అయినప్పటికీ సభాపతి అనుమతించలేదు. దీంతో కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ, డీఎంకే, సమాజ్వాదీ, ఎన్సీపీ, వామపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం సరికాదని రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. కాంగ్రెస్ సభా కార్యకలాపాలను అడ్డుకునే విధానాలను అనుసరిస్తోందని దుయ్యబట్టారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సున్నితమైన అంశాలపై చర్చను పార్లమెంటు అంగీకరించలేదని గోయల్ చెప్పారు. పార్లమెంటరీ నిబంధనలను గౌరవించడం మానేసే స్థాయికి ప్రతిపక్షాల్లో నైరాశ్యం చేరుకుందని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ చేసే రాజకీయాలు మరీ దిగజారిపోయాయని ధ్వజమెత్తారు.