కాలి గాయంతో ప్రభుత్వాస్పత్రిలో చేరిన యువ ఫుట్‌బాల్ ప్లేయర్.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మంగళవారం మృతిచెందింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాహాయం అందిస్తామని ప్రకటించారు. అయితే ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు ఏం జరిగిందంటే..
కొన్ని రోజుల క్రితం మోకాళ్లలో సమస్యతో 17 ఏళ్ల ఫుట్‌బాల్ ప్లేయర్ పెరియార్ నగర్ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. కొన్ని రోజుల తర్వాత సమస్య తీవ్రమై.. ఆమె కాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు వైద్యులు. అయితే సర్జరీ అనంతరం పరిస్థితి మరింత క్లిష్టమైంది. దీంతో నవంబర్ 8న రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కాలును తీసేయాలని సూచించి.. ప్రియ కుడి కాలును తీసేశారు. ఆ తర్వాత రక్తస్రావం ఎక్కువైంది. దీంతో ఆమెను ఐసీయూ(ఇంటెన్సీవ్ కేర్ యూనిట్)కు తరలించారు. అనంతరం నవంబర్ 15న ఉదయం పరిస్థితి విషమించి యువతి మృతిచెందింది.
"శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు పెట్టిన సెక్షన్లు కాకుండా.. క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తాం."
-ఆల్బర్ట్ జాన్, డీసీపీ చెన్నై
ఈ ఘటనపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ స్పందించారు. ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని.. ప్రాథమికంగా తేలిందని అన్నారు. 'ఈ ఘటనపై మేం ఎంక్వైరీ చేశాం. ఆపరేషన్ అనంతరం సరైన బ్యాండేజ్ వేయకపోవడం వల్ల రక్తస్రావం ఎక్కువైంది. ఆపై ఆమె కిడ్నీ చెడిపోయింది. రక్త ప్రసరణ లేక చనిపోయింది. ప్రియ మరణం తీరని లోటు. ఆమె కుటుంబ పరిస్థితి దృష్ట్యా.. ఈ విషయం ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తాం. సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు ఆర్థిక సాహాయం అందిస్తాం. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం' అని మంత్రి పేర్కొన్నారు. పోస్టు మార్టం పరీక్షల అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని వైద్యులు తెలిపారు.
ఇవీ చదవండి : స్వీటీ వెడ్స్ షేరు.. అంగరంగా వైభవంగా కుక్కల పెళ్లి