Chandrababu skill development case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు దాఖలుచేసిన ప్రధాన బెయిలు పిటిషన్, మధ్యంతర బెయిలు కోసం దాఖలుచేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ వేళ సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాష్ట్రప్రభుత్వం వెయ్యిపేజీలతో దాఖలుచేసిన కౌంటర్ కాపీని తమకు బుధవారం రాత్రి అందజేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆ కౌంటర్ ఇంకా కోర్టు ఫైలులోకి చేరలేదన్నారు. పేజీలు సరిగా కనిపించట్లేదని దాన్ని హైకోర్టు రిజిస్ట్రీ వెనక్కి పంపిందన్నారు.
Kanakamedala Complaint on YSRCP Govt: ఏపీలో మానవ హక్కుల అణచివేత.. జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఫిర్యాదు
ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాదులు స్పందిస్తూ.. ‘‘పిటిషనర్ ఇప్పటికే 40 రోజులకు పైగా జైల్లో ఉన్నారని.... ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకొని రెండు రోజులు విచారించారని గుర్తుచేశారు. మరో అయిదు రోజులు కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ అభ్యర్థనను ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్నారు. ఈ కేసులో 40 రోజులుగా దర్యాప్తులో పురోగతి లేదన్నారు. చంద్రబాబు బరువు బాగా తగ్గారని...ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన ఉందని తెలిపారు. తనకు నచ్చిన వైద్యుని వద్ద పరీక్షలు నిర్వహించుకునే హక్కు పిటిషనర్‌కు ఉందని.. అందుకు అనుమతించాలని కోరారు. ప్రభుత్వంపై విశ్వాసం లేదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని రెండువారాల పాటు మధ్యంతర బెయిలు మంజూరుచేయాలని కోరారు. అందుకోసమే అనుబంధ పిటిషన్ వేశాంమని కోర్టుకు దృష్టికి తీసుకువ్చారు.
ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించిందని, అందువల్ల ప్రస్తుత పిటిషన్లోనూ మధ్యంతర బెయిలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఆ వాదనలపై చంద్రబాబు తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ‘‘అదనపు ఏజీ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మధ్యంతర బెయిలు కోసం సుప్రీంకోర్టును కోరగా.. గురువారం హైకోర్టులో బెయిలు పిటిషన్‌పై విచారణ ఉందని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారన్నారు. అందుకే మధ్యంతర బెయిలు విషయాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించిందన్నారు. అదనపు ఏజీ పొన్నవోలు స్పందిస్తూ వైద్యపరీక్షల విషయంలో అధికారుల నుంచి సమాచారం తీసుకోవాల్సి ఉందని, విచారణను మధ్యాహ్నం 2.15కి వాయిదా వేయాలని కోరారు. ఆ తర్వాత జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు వైద్య నివేదికలను హైకోర్టు ముందు ఉంచేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు. మధ్యంతర బెయిలు అనుబంధ పిటిషన్, ప్రధాన పిటిషన్లపై విచారణను వెకేషన్ బెంచ్ వద్దకు వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.