Chandrababu case Arguments : స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( skill development case ) లో 409 సెక్షన్ సరికాదని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పష్టం చేశారు. ఆ సెక్షన్ పెట్టాలంటే ముందుగా సరైన ఆధారాలు చూపాలని తన వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్టు (Remand Report) తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు. దీంతో తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? అని సీఐడీని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. శనివారం ఉదయం 6 గంటలకే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు. 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశామని కోర్టుకు వెల్లడించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ రాజకీయ ప్రేరేపితమని న్యాయవాది లూథ్రా స్పష్టం చేశారు. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయని, తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది.. ఈ కేసు ఎప్పుడో ముగిసిందని తెలిపారు. నిందితులందరికీ బెయిల్ వచ్చిందని లూథ్రా వివరించారు. ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారని ఆరోపించారు. చంద్రబాబుపై చేసినవి ఆధారాల్లేని ఆరోపణలని తేల్చిచెప్పారు. ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసిందన్నారు. సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదని, ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్న సమయంలో సెక్షన్-409 ( Section 409 ) వర్తించదన్నారు. ఎఫ్ఐఆర్ (FIR)లో చంద్రబాబు పేరు లేదు, కాబట్టి సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి వాడిన భాషను గమనించాలన్నారు.
చంద్రబాబును నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అయినా కూడా ప్రభుత్వం వాళ్లనుకున్న చోటే ప్రవేశపెట్టింది. కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా 24 గంటలపాటు చంద్రబాబును ఎందుకు నిర్భందించారో అర్థం కావట్లేదని లూథ్రా వ్యాఖ్యానించారు. సీఐడీ (CID) ఆరోపణలు చేసినట్లు చంద్రబాబు లండన్ వెళ్లడం లేదన్నారు. చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు సీఐడీ చెబుతోంది. కానీ, బాబును ముందురోజు రాత్రి 11 గంటలకే సీఐడీ పోలీసులు చుట్టుముట్టారని, ఆ సమయం నుంచే అరెస్ట్ చేసినట్టుగా పరిగణలోకి తీసుకోవాలని గుర్తు చేశారు. రాత్రి 11 గంటలకు చుట్టుముట్టి కదలకుండా చేయడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమేనని ఆక్షేపించారు. సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు ( Call data record ) లను అందించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అరెస్టు చేసిన పోలీసుల 48గంటల కాల్ డేటా కోర్టుకు సమర్పించాలన్నారు.
అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదని లూథ్రా విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరం. ఇది అనుబంధ పిటిషన్ మాత్రమేనని తెలిపారు. రిమాండ్ రిపోర్టు వరకు మాత్రమే వాదనలు పరిమితం చేయాలని వివరించారు. అరెస్టు అంటే అర్థం ఏమిటో సీఐడీ లాయర్లకు సిద్దార్థ్ లూథ్రా వివరించారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసు ( Punjab Maninder Singh Case ) ను లూథ్రా ప్రస్తావించారు.
ఈ క్రమంలో ఏపీ సీఐడీ అధికారులకు న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. 2021లో కేసు పెడితే ఇప్పటి వరకు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. రిమాండ్ రిపోర్ట్‌లో అన్ని అంశాలు చేర్చామని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలపగా.. 409 సెక్షన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. మధ్యలో న్యాయమూర్తి పలుమార్లు విరామం ఇచ్చారు. సుమారు గంటపాటు భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో తిరిగి ప్రారంభమైన వాదనలు 2.30 గంటల సమయంలో ముగిశాయి. ఉదయం నుంచి సుమారు 6.30 గంటల పాటు ఈ వాదనలు కొనసాగిన నేపథ్యంలో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.