Chandrababu and Pawan Kalyan at Bhogi Festival: సంక్రాంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను భోజనానికి చంద్రబాబు ఇంటికి పిలిచారు. ఉండవల్లిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. రేపు ఇద్దరూ కలిసి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేయనున్నారు.
ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ సైతం సమావేశమయ్యారు. సంక్రాంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తన ఇంటికి భోజనానికి చంద్రబాబు ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు, పవన్, లోకేష్, నాదెండ్ల మనోహర్ కలిసి భోజనం చేశారు. ఆత్మీయ విందు తర్వాత నలుగురు నేతల కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు మూడున్నర గంటల పాటు సమావేశం సాగింది.
తెలుగుదేశం - జనసేన సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఓ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. తెలుగుదేశం - జనసేన పార్టీల్లో వైసీపీ నేతల చేరికలు, వారికి సీట్ల కేటాయింపు పైనా చర్చించినట్లు తెలుస్తొంది. ఉమ్మడి ప్రచార సభలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలపైనా చర్చ జరిగింది. అదే విధంగా మందడంలో నిర్వహించే భోగి మంటలు కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు కలిసి పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో తగల పెట్టనున్నారు.
చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల - కుమారుడి పెళ్లికి ఆహ్వానం
Chandrababu Sankranti Wishes: జగన్ రాతియుగ పాలనకు ముగింపు పలుకుతూ స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి నుంచి సంకల్పం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధ్వంస పాలన ప్రజల జీవితాల్ని చీకటిమయం చేసిందని, పండుగ సంతోషాన్ని ప్రజలకు దూరం చేసిందని చంద్రబాబు అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపుతూ ఏ ప్రకటన విడుదల చేశారు. ‘‘మీ, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తాము చేసే పోరాటంలో భాగస్వాములవ్వండని పిలుపునిచ్చారు. చేయిచేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దామని’’ చంద్రబాబు తెలిపారు.