స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలు, భిన్న లింగ సంపర్కుల పెళ్లిళ్లు పూర్తిగా విరుద్ధమైనవని.. భారత కుటుంబవ్యవస్థతో పోల్చలేమని స్పష్టంచేసింది. వాటిని చట్టబద్ధమైన హక్కుగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.
"వివాహం అనే కాన్సెప్ట్.. వ్యతిరేక లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య కలయికను సూచిస్తుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం వల్ల.. పెళ్లి అనే భావనను దెబ్బతీయకూడదు, నీరుగార్చకూడదు. అన్ని మతాలకు సంబంధించిన వ్యవహారాలను పర్సనల్ చట్టాలు చూసుకుంటాయి. ఆయా మతాలకు వర్తించే చట్టాల్ని బట్టి.. వివాహ స్వభావం భిన్నంగా ఉంటుంది. హిందువుల్లో పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం. మహిళ, పురుషుడు వారి పరస్పర విధులు నిర్వర్తించుకునే మతకర్మ. కానీ ఇస్లాంలో వివాహం మహిళ, పుపుషుడి మధ్య ఒక ఒప్పందం. మతపరమైన, సామాజిక నిబంధనలతో లోతైన అవగాహనతో చేసిన శాసనపరమైన విధానాలను మార్చడానికి రిట్ పిటిషన్ వేయడం అనుమతించలేం. పర్సనల్ చట్టాలకు అనుగుణంగా పార్లమెంట్ వివాహ చట్టాలను రూపొందించింది. అవి.. మహిళ, పురుషుడి మధ్య వివాహనికి మాత్రమే చట్టపరమైన అనుమతి ఇస్తాయి. వారే చట్టం ద్వార వచ్చిన హక్కులకు అర్హులు.
స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే.. సున్నితమైన పర్సనల్ చట్టాల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. అందరూ పాటిస్తున్న సామాజిక నియమాలకు భంగం కలుగుతుంది. పర్సనల్ చట్టాలలో ఇలాంటి వాటిని గుర్తించడం గాని.. అమలు చేయడం గాని కుదరదు. ఇలాంటి వివాహాలకు ఇదివరకే సెక్షన్ 377 ఉంది. వీటికి మళ్లీ ప్రాథమిక హక్కు కింద పిటిషనర్లు కోరకూడదు." అని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.
స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాలని కోరుతూ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్కు చెందిన అభయ్ దాంగ్, సుప్రియో చక్రవర్తి.. ఈ వ్యాజ్యం వేశారు. వీరితో పాటు పార్థ్ ఫిరోజ్, ఉదయ్ రాజ్ అనే మరో స్వలింగ సంపర్కుల జంట కూడా ఇదే విషయమై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఒకే లింగానికి చెందిన వారనే కారణంతో ఇద్దరి వివాహానికి గుర్తింపు ఇవ్వకపోవడం.. రాజ్యాంగంలోని 14, 21వ అధికరణల కింద సమానత్వ హక్కును ఉల్లఘించడమేనని ఆయా పిటిషన్లలో వారు వాదించారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని సూచిస్తూ నోటీసులు జారీ చేసింది. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు సంబంధించి దేశంలోని వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు అన్నింటినీ ఏకం చేసి.. తనకు బదిలీ చేసుకుంది సుప్రీంకోర్టు. సర్వోన్నత న్యాయస్థానం నోటీసుల నేపథ్యంలో.. కేంద్రం ఇప్పుడు అఫిడవిట్ సమర్పించింది.