ఆయుధ లైసెన్సుల జారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలలో కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) సోదాలు నిర్వహించింది. దాదాపు 40 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. జమ్ము, శ్రీనగర్, ఉధంపుర్, రాజౌరీ, అనంతనాగ్, బారాముల్లా సహా దిల్లీలోని పలువురు ఐఏఎస్ అధికారుల ఇళ్లను సైతం తనిఖీ చేసింది. 20 ఆయుధ శాలల్లో సోదాలు చేపట్టింది.
నకిలీ పత్రాల సాయంతో స్థానికేతరులకు అక్రమంగా వేల సంఖ్యలో ఆయుధ లైసెన్సులు జారీ చేశారంటూ 2012-16 మధ్య ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై 2019లో ఓ కేసు నమోదైంది. ఇందులో భాగంగా ఈ సోదాలు చేపట్టింది సీబీఐ.
కేసు నేపథ్యమిది!
జమ్ము కశ్మీర్ జిల్లా కమిషనర్లు డబ్బుల కోసం భారీ ఆయుధాల లైసెన్సులను అక్రమంగా జారీ చేశారన్నది ప్రధాన ఆరోపణ. దాదాపు రెండు లక్షల లైసెన్సులను అక్రమంగా జారీ చేయడంపై సీబీఐ గతంలో దర్యాప్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన కేసులో 2019 డిసెంబర్లోనే పదికి పైగా ప్రాంతాలలో సోదాలు చేసింది.
ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన రాజస్థాన్ ఏటీఎస్(ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్) 2017లో 50 మందిని అరెస్టు చేసింది. దాదాపు మూడు వేల అనుమతులను ఆర్మీ సిబ్బంది పేరిట తప్పుగా జారీ చేశారని రాజస్థాన్ ఏటీఎస్ పేర్కొంది. దీంతో ఈ కేసును అప్పటి జమ్ముకశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా.. సీబీఐకి అప్పగించారు.
ఇదీ చదవండి: Karnataka Politics: కమల దళం.. కుర్చీలాట