CAG Said Ward Secretariat System Unconstitutional in Andhra Pradesh: వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని కాగ్ స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పౌర భాగస్వామ్యం లేకుండా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం.. స్థానిక పాలనలో వికేంద్రీకరణను దెబ్బతీయడమేని కుండబద్దలు కొట్టింది. 74వ రాజ్యాంగ సవరణకు, పురపాలక చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థ లేదని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది.
నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల వ్యవస్థ.. రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్ దుయ్యబట్టింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టాల్లోని నిబంధనలను నీరుగార్చేలా వార్డు సచివాలయ వ్యవస్థ ఉందని, స్థానిక పాలనలో వికేంద్రీకరణను దెబ్బతీయడమేనని తూర్పారబట్టింది.
జగన్ సర్కారు తీరుపై కాగ్ తన నివేదికలో ఏం పేర్కొంది?
పౌరులకు, పాలనకు వారధిగా నిలవాల్సిన వార్డు కమిటీల వ్యవస్థ ప్రభుత్వ తీరుతో అసంబద్ధంగా తయారైందని, వాటి ప్రయోజనాలూ దెబ్బతిన్నాయని మొట్టికాయలేసింది. ఇది వార్డు స్థాయిలో సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన కార్యనిర్వహణ వ్యవస్థ అని, అందులోని కార్యదర్శులు పురపాలక కమిషనర్ ద్వారా ఎన్నికైన పాలకవర్గానికి బాధ్యత వహిస్తారని పురపాలకశాఖ చెప్పే అభిప్రాయం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది.
వార్డు కమిటీలు, ప్రాంతీయ సభల్లాంటి వ్యవస్థల్లో నిర్దేశించినట్లు ఎన్నికైన ప్రతినిధులు, పౌరసమాజ సభ్యుల భాగస్వామ్యం లేదని స్పష్టం చేసింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమలు సమర్ధతపై విడుదల చేసిన సమీక్షా నివేదికలో.. వార్డు సచివాలయ వ్యవస్థతోపాటు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనం, విధుల అప్పగింతపై ప్రభుత్వ తీరును కాగ్ తీవ్రంగా ఎండగట్టింది.
AP Debts: అందినకాడికి అప్పులు.. 9 నెలల అప్పులు 4 నెలల్లోనే..
రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టాలు చేసినా అమలుకు తగిన చర్యలు తీసుకోలేదంది. అధికారాలతో, సమర్థమైన నిధుల వికేంద్రీకరణకు తగిన వ్యవస్థాగత యంత్రాంగాన్ని రూపొందించేలా ప్రభుత్వం కృషి చేయాలని సిఫారసు చేసినట్లు పేర్కొంది.
ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజల్ని భాగస్వాముల్ని చేయడంతోపాటు.. పాలనను చేరువ చేయడం స్థానిక స్వపరిపాలన ప్రధాన లక్ష్యమని కాగ్ గుర్తు చేసింది. ఆ ప్రయోజనాల్ని దెబ్బతీసేలా వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని తీవ్రంగా ఆక్షేపించింది. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పాటు చేయాల్సిన వార్డు కమిటీలను పక్కనపెట్టి.. వాటికి బదులుగా వికేంద్రీకృత పాలన పేరుతో 2019 జులైలో వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొంది.
Miscalculations to CAG: కాగ్ వద్ద కూడా రాష్ట్ర ప్రభుత్వ అంకెల గారడీ
ఒక్కో వార్డు సచివాలయానికి 10 మంది వార్డు కార్యదర్శుల చొప్పున 3వేల 876 సచివాలయాల్లో 37వేల 860 కార్యదర్శులతోపాటు.. పనితీరు ఆధారిత గౌరవ వేతనంపై 70వేల 888 మంది వాలంటీర్లను నియమించిన విషయం ప్రస్తావించింది. వీరి కోసం 2019-20, 2020-21 సంవత్సరాల్లో 11వందల 91 కోట్లు ఖర్చు చేశారని కాగ్ వివరించింది.
రాజ్యాంగంలోని 243-S అధికరణం ప్రకారం 3 వేలు, అంతకుపైబడిన జనాభా ఉన్న అన్ని పురపాలక సంస్థల్లో.. వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని కాగ్ గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, 1994లోని సెక్షన్ 10తోపాటు ఆంధ్రప్రదేశ్ పురపాలక మండలి నియమాలు, 1995 నియమం 3 ప్రకారం కూడా.. అన్ని పట్టణ స్థానిక సంస్థలూ వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలంది. ఈ కమిటీకి నగరపాలక సంస్థ సభ్యుడు అధ్యక్షుడిగా, పౌర సమాజ ప్రతినిధులు 10 మంది, ప్రాంతీయ సభ ప్రతినిధులు ఉంటారని తెలిపింది.
ఆ వివరాలివ్వండి.. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి కాగ్ లేఖ
పురపాలక సంఘం, పౌరుల మధ్య వారధిగా, పొరుగు పాలనా సంస్థలుగా ఇవి పనిచేస్తాయనే విషయం ప్రస్తావించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పౌరుల మధ్య సామీప్యతను పెంచడమే కాకుండా.. స్థానిక స్థాయి ప్రణాళిక తయారీలో పౌరుల భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తాయంది. పారిశుద్ధ్య పనులు, మురుగు కాల్వల నిర్వహణ, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ లాంటి విధుల్ని నిర్వహిస్తాయని పేర్కొంది. తనిఖీ చేసిన అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు కమిటీల ఏర్పాటే లేదని కాగ్ గుర్తించింది. పాలనలో సమాజ భాగస్వామ్యాన్ని ఏర్పరిచే లక్ష్యం నెరవేరలేదని అభిప్రాయపడింది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం సెక్షన్ 8-B ప్రకారం.. నగరపాలక సంస్థలోని ప్రతి వార్డులో జనాభా ఆధారంగా 2 వేలకు తక్కువ కాకుండా, 5వేలకు మించకుండా ప్రాంతాలను విభజించి ప్రాంతీయ సభ ఏర్పాటు చేయాలని కాగ్ తెలిపింది. దీనికి నగరపాలక సంస్థ నుంచి ప్రతినిధి ఉంటారని.. తనిఖీ చేసిన నగరపాలక సంస్థల్లో ఎక్కడా ప్రాంతీయ సభలే ఏర్పాటు కాలేదని గుర్తు చేసింది.
దీనివల్ల పౌరుల భాగస్వామ్యం కొరవడిందని కాగ్ వ్యాఖ్యానించింది. వార్డు కమిటీలు, ప్రాంతీయ సభలను ఏర్పాటు చేయలేదని 2022 డిసెంబరులో పురపాలకశాఖ అంగీకరించిన విషయాన్నీ ప్రస్తావించింది. స్వపరిపాలన సాధించడానికి వీలుగా వార్డు కమిటీలను ఏర్పాటుచేయాలని స్పష్టం చేసింది. వార్డు కమిటీలు, ప్రాంతీయ సభలకు బాధ్యత వహించేలా వార్డు సచివాలయాల్ని అనుసంధానం చేయాలని సిఫార్సు చేసింది.
"రాబడి పెరగట్లేదు.. అప్పులు తీరట్లేదు".. కాగ్ హెచ్చరిస్తున్నా దిద్దుబాటు చర్యల్లేవు