Buy These Auspicious Things on Dhanteras 2023 : హిందూ సంప్రదాయంలో ధన త్రయోదశికి ప్రత్యేక స్థానం ఉంది. దీనినే ధంతేరాస్ను అని కూడా అంటారు. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి రోజున.. ఈ ధన త్రయోదశి పండగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి తిథి నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభమై, నవంబర్ 11వ తేదీ మరుసటి రోజు మధ్యాహ్నం 1.57 నిమిషాలకు ముగుస్తుంది. ప్రదోష పూజ పవిత్ర సమయాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఈ సంవత్సరం ధన త్రయోదశి పండగను నవంబర్ 10వ తేదీన జరుపుకుంటారు.
ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద లభిస్తుందని భక్తులు నమ్ముతారు. దీపావళికి ముందు జరుపుకునే ఈ ప్రధానమైన పండగకు చాలా విశేషం ఉంది. ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారో.. వారు సంపన్నులుగా జీవిస్తారని, సుఖ శాంతులు అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే.. ధంతేరాస్ రోజున కొన్ని వస్తువులు కొంటే మంచి జరుగుతుందని.. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని విశ్వసిస్తారు. మరి ధంతేరాస్ రోజున ఏ వస్తువులు కొనడం శ్రేయస్కరమో ఈ కథనంలో తెలుసుకుందాం.
Gold Purity Check : శ్రావణమాసంలో బంగారం కొనాలా?.. ఆభరణాల స్వచ్ఛత తెలుసుకోండి ఇలా?
బంగారం: భారతీయులకు, బంగారానికి విడదీయరాని బంధం ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్ల నుంచి పెళ్లిళ్ల వరకు.. ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే. ఈ ధంతేరాస్ రోజున కూడా బంగారం కొనుగోలు చేయాలని చెబుతారు. 2 గ్రాముల బంగారం కొన్నా సరే శుభసూచకంగా భావిస్తుంటారు. ఆ రోజున బంగారం కొనడం అంటే.. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడమేనని విశ్వసిస్తుంటారు.
వెండి వస్తువులు: ధన త్రయోదశి నాడు అత్యంత పవిత్రమైనదిగా భావించే మరొక విలువైన లోహం వెండి. ఈ పండగ నాడు బంగారాన్ని కొనలేని వారు వెండి పాత్రలు, నాణేలు కొనుగోలు చేస్తారు. వెండి కూడా స్వచ్ఛతకు చిహ్నం. ఇంటికి సంపద, శ్రేయస్సును అందించడానికి వెండి తోడ్పడుతుందని చాలా మంది విశ్వసిస్తారు.
వంట పాత్రలు: ధంతేరాస్ నాడు వంట పాత్రల కొనుగోలు కూడా శుభప్రదంగా భావిస్తారు. కొత్త వంట పాత్రలను కొనుగోలు చేయడం వల్ల వంట గది కళకళలాడుతూ ఉంటుందని.. తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని చాలా మంది భావిస్తారు.
కొత్త చీపురు : లక్ష్మీదేవికి చిహ్నంగా చీపురును పరిగణిస్తారు. పురాణాల ప్రకారం.. చీపురు ఇంట్లోని ప్రతికూలతలను తొలగించడమే కాక సానుకూల వాతావరణాన్ని తీసుకురావడంలో సహాయం చేస్తుంది. పేదరికం నుంచి కూడా దూరం చేస్తుందని భావిస్తారు. సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి అనుగ్రహానికి మార్గం చూపుతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే.. ధన త్రయోదశి రోజున కొత్త చీపురును తప్పకుండా కొనుగోలు చేస్తారు.
ప్రమిదలు: ఈ ధన త్రయోదశి నాడు చాలా మంది మట్టితో తయారు చేసిన ప్రమిదలు లేదా దీపాలను కొనుగోలు చేస్తారు. ఈ మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం ధంతేరాస్లో ముఖ్యమైన విషయం. ఈ దీపాల నుంచి వచ్చే కాంతి.. లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తుందని.. జీవితంలోని చీకటి, ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు.
PRATHIDWANI: భవిష్యత్లో తులం బంగారం ధర రూ.లక్ష దాటుతుందా..!