రూ.2000 నోట్ల ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో కొందరు తమ దగ్గరున్న ఈ నోట్లను వదిలించుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్ జిల్లాకు చెందిన ఓ బస్సు ఓనర్ ఏకంగా తన వాహనంపై ఉన్న రూ.6 లక్షల ట్యాక్స్‌లో రూ.4 లక్షలను కట్టేందుకు రూ.2 వేల నోట్లను వినియోగించాడు. దేశంలో చలామణీలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్నట్లు మే 19న ఆర్బీఐ ప్రకటించిన తర్వాత రోజే ఈ సంఘటన జరగడం గమనార్హం.
కొంతకాలం క్రితం.. ఆర్టీఏ తనిఖీల సమయంలో రాజ్‌కోట్‌కు చెందిన బస్సు ఆపరేటర్ సొంత వాహనంపై ఒక ఏడాదికి సంబంధించి పన్ను బకాయి ఉందని గుర్తించారు అధికారులు. దీంతో బస్సును ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొచ్చి షెడ్లో ఉంచారు. మొత్తం ట్యాక్స్‌ను కట్టిన తర్వాతే బస్సును తిరిగి తీసుకెళ్లాలని అధికారులు తేల్చి చెప్పారు. అయినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. అయితే రెండ్రోజుల క్రితమే రూ.2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం వచ్చిన మరుసటి రోజే అతడు రూ.2వేల నోట్లతో ట్యాక్స్ చెల్లించాడు.
"తాజాగా సూరత్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి ఓ లగ్జరీ బస్సు యజమాని వచ్చాడు. అతడి వాహనంపై ఏకంగా రూ.6 లక్షల వరకు పన్ను బాకీ ఉంది. ఇందులో రూ.4 లక్షలను మొత్తం రూ.2 వేల నోట్లతోనే చెల్లించాడు. మిగతా రెండు లక్షలను రూ.100, రూ.500ల నోట్లతో చెల్లించాడు" అని అధికారి తెలిపారు.
'అనంతకోటి ఉపాయాలు'!
'శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు' అన్నట్లుగా రూ.2000 నోట్ల విత్‌డ్రా విషయంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో వాటిని వదిలించుకునేందుకు అనేక మార్గాలను ప్రజలు అన్వేషిస్తున్నారు! దీనికి సామాన్యులు సైతం అతీతులు కారు. ఇప్పటికే కొందరు తమ దగ్గరున్న రూ.2000 నోట్లను పెద్ద మొత్తంలో షాపింగ్‌కు వినియోగిస్తుండగా.. మరికొందరు సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో కొనుగోళ్లకు ఎక్కువగా ఈ నోట్లనే తీసుకెళ్తున్నారట. మరోవైపు పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారుల్లో ఎక్కువమంది ఈ నోట్లనే తెస్తున్నారట. ఈ ఉపసంహరణ నిర్ణయం కారణంగా ఇప్పటికే ఆన్లైన్ చెల్లింపులు కూడా క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ ఆన్లైన్లో క్రయవిక్రయాలు జరిపే వారు కూడా రూ.2000 నోట్లను ఎక్కువగా వాడుతున్నారు.
పెరిగిన రైల్వే టికెట్ల అమ్మకాలు!
రూ.2 వేల నోట్ల ప్రభావం సూరత్ రైల్వే స్టేషన్‌లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్‌లోనూ స్పష్టంగా కనిపించింది. రోజూవారీ టికెట్ల అమ్మకాల కంటే కూడా ఇక్కడ రెట్టంపు స్థాయిలో టిక్కెట్లు విక్రయాలు జరిగాయి. సాధారణంగా రోజూ 2000 నుంచి 2500 వరకు టిక్కెట్లు అమ్మే అధికారులు.. శనివారం ఏకంగా 5 వేలకు పైగా రిజర్వేషన్ టిక్కెట్లను విక్రయించారు. అది కూడా చాలా మంది రూ.2000 నోట్లను ఇచ్చి టిక్కెట్లను కొనుగోలు చేశారు.
అయితే రూ.2వేల నోటు డిపాజిట్/మార్పిడికి సంబంధించి అటు సామాన్యులతో పాటు ఇటు సంపన్నులోనూ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాజాగా కొన్ని మార్గదర్శకాలనూ విడుదల చేసింది. మరి ఆ రూల్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.