కేరళలోని కన్నూర్ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. పయ్యనుర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాలయంపై బాంబు విసిరారు. ఈ ఘటన తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో జరిగింది. దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉన్నారని.. కానీ గాయాలు కాకుండా తప్పించుకున్నారని పోలీసుల తెలిపారు. ఈ దాడిలో కార్యాలయ కిటికీలు, అద్దాలు, తలుపులు ధ్వంసం అయ్యాయి.
'సీపీఎం హస్తం'
ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు పోలీసులు. అయితే, ఈ దాడి వెనుక అధికార సీపీఎం ఉందని ఆర్ఎస్ఎస్ ఆరోపించింది. పయ్యనుర్ సీపీఎం నాయకుడు ధన్‌రాజ్ వర్ధంతి నేపథ్యంలో ఈ దాడి జరిగింది. అతడి మరణం వెనుక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అంతకుముందు జూన్ 30న కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. వయనాడ్‌లోని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన కొన్ని రోజులకు ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జూన్ 30 రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ఓ వ్యక్తి.. సీపీఎం ప్రధాన కార్యాలయం గేటుపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. "ఏకేజీ సెంటర్లోని మూడో అంతస్తులో నేను పనిచేసుకుంటున్నాను. రాత్రి 11:30 గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. గేటు వద్ద పొగ అలుముకుంది. ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఖండించాలి" అని సీపీఐఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పీకే శ్రీమతి వెల్లడించారు.
ఇవీ చదవండి:
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈడీ సమన్లు.. అప్పుడే విచారణ
సీనియర్లు, జూనియర్ మధ్య వాగ్వాదం.. పదో తరగతి విద్యార్థి మృతి