2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పోటీ చేసిన స్థానాలు 437. గెలిచినవి 303. మరి మిగిలిన నియోజకవర్గాల సంగతేంటి? అక్కడ కమలదళం ఎందుకు ఓడిపోయింది? ప్రస్తుతం ఆయా చోట్ల పార్టీ పరిస్థితి ఏంటి? 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ నియోజకవర్గాల్నీ దక్కించుకోవాలంటే ఏం చేయాలి?.. కొంతకాలంగా కమలనాథుల్ని ఆలోచింపచేసిన ప్రశ్నలివి. తీవ్ర మేధోమధనం తర్వాత ఓ స్పష్టతకు వచ్చారు భాజపా అగ్రనేతలు. గత ఎన్నికల్లో ఓడిపోయిన, ప్రస్తుతం పార్టీ బలహీనంగా ఉన్న 144 నియోజకవర్గాల్ని గుర్తించి.. ఆయా స్థానాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు.
ఆపరేషన్ 144!
BJP strategy for 2024 : 'లోక్‌సభ ప్రవాస్ యోజన' రెండో దశలో భాగంగా 144 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది భాజపా. దేశంలోని 40 చోట్లకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెళ్లనున్నారు. అక్కడ భారీ స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మిగిలిన 104 స్థానాల బాధ్యత.. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేబినెట్ మంత్రులది. వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో క్లస్టర్‌గా పరిగణిస్తారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కేంద్ర మంత్రి బాధ్యునిగా ఉంటారు. స్థానికంగా ఉండే వేర్వేరు రంగాల ప్రముఖులతో తరచుగా సమావేశాలు నిర్వహించడం; అసమ్మతి నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడి, వారి సమస్యలు పరిష్కృతమయ్యేలా చూడడం కేంద్ర మంత్రుల బాధ్యత. లోక్‌సభ ప్రవాస్ యోజన రెండో దశ అమలు కోసం మంత్రులకు ఐదు అంశాలతో స్పష్టమైన ప్రణాళికను ఖరారు చేసింది భాజపా. ఆ ఐదు అంశాలు..
- ప్రచార ప్రణాళిక అమలుపరచడం
- ప్రజలకు పార్టీని చేరువచేసే కార్యక్రమాలు చేపట్టడం
- పొలిటికల్ మేనేజ్మెంట్
- ఫలితాన్ని ప్రభావితం చేయగల అంశాల్ని గుర్తించడం
- లోక్‌సభ నియోజకవర్గంలో రాత్రి బస
వారితో ప్రత్యేక భేటీలు
ప్రతి నియోజకవర్గంలోనూ 'స్థానిక మంత్రం'తో ప్రజలకు చేరువయ్యేలా ప్రత్యేక వ్యూహం రచించింది భాజపా. ఇందుకోసం ఆయా క్లస్టర్లకు బాధ్యులుగా వ్యవహరించే కేంద్ర మంత్రులకు స్పష్టమైన విధులు కేటాయించింది. అవి..
- స్థానికంగా పేరుగాంచిన మత పెద్దలు, సాధువులు, వేర్వేరు వర్గాల నేతల ఇళ్లకు కేంద్ర మంత్రులు వెళ్లి, వారితో సమావేశం కావాలి.
- స్థానికంగా జరిగే ఉత్సవాలు, ఇతర కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పాల్గొనాలి.
- ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల స్థానిక నేతలు, ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలి.
- నియోజకవర్గంలోని ప్రముఖ న్యాయవాదులు, వైద్యులు, ప్రొఫెసర్లు, వ్యాపారులు, ఇతర వృత్తి నిపుణులతో తరచుగా వర్చువల్ సమావేశాలు నిర్వహించాలి.
Parliament of India election 2019 : గత సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి మొత్తం 353 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 52 సీట్లకు పరిమితం కాగా.. ఆ పార్టీ సారథ్యంలోని యూపీఏకు 91 స్థానాలు వచ్చాయి. ఇతర పార్టీలు అన్నింటికీ కలిపి 98 సీట్లు వచ్చాయి.