రిక్షా నడిపే స్థాయి నుంచి క్యాబ్ సేవలందించే కంపెనీలకు యజమానిగా ఎదిగాడు బిహార్‌కు చెందిన దిల్‌ఖుష్ కుమార్. సుమారు 4000 వరకు క్యాబ్‌లను తన యాప్‌కు అనుసంధానించి పరోక్షంగా ఎంతో మంది డ్రైవర్లకు స్వయం ఉపాధిని కల్పిస్తున్నాడు. బిహార్ సహర్సా జిల్లాలోని బంగావ్ గ్రామానికి చెందిన దిల్‌ఖుష్ కుమార్ ఒకప్పుడు దిల్లీ వీధుల్లో రిక్షా తొక్కేవాడు. కానీ ఇప్పుడు అతడు రెండు స్టార్టప్‌లకు యజమానిగా మారాడు. రాజధాని పట్నాలో వీటిని విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అతడు రూపొందించిన క్యాబ్ సర్వీసెస్ యాప్‌ల ద్వారా అక్కడి ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నాడు. అంతేగాక పెద్ద సంఖ్యలో డ్రైవర్లు కూడా ఈ సంస్థల్లో చేరి స్వయం ఉపాధిని పొందుతున్నారు. ప్రస్తుతం దాదాపు 4000 వాహనాలను కంపెనీకి అనుసంధానించిన దిల్‌ఖుష్ ఈ ఏడాది చివరి నాటికి వీటి సంఖ్యను 25 వేలకు పెంచటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇది నేపథ్యం..
దిల్‌ఖుష్ ఇంటర్మీడియట్ వరకు చదివాడు. తండ్రి పవన్ ఖాన్ బస్సు డ్రైవర్. కొద్దిరోజులు పట్నాలో బస్సు డ్రైవర్ ఉద్యోగమూ చేశాడు. అనంతరం ఉపాధి కోసం దిల్లీకి వలస వెళ్లాడు. కానీ ఇక్కడ అతడికి బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం దొరకలేదు. దీంతో అతడు రిక్షావాలా అవతారం ఎత్తి జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా స్వగ్రామానికి తిరిగి వచ్చిన దిల్‌ఖుష్ సొంతంగా స్టార్టప్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్లో బిహార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీడ్ ఫండ్ పథకం కింద రూ.5.50 లక్షల రుణం తీసుకొని 2016 అక్టోబర్‌లో ఆర్యగో క్యాబ్ సర్వీసెస్ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించి ఓ యాప్‌ను రూపొందించాడు. ఇందులో దాదాపు 350 వరకు క్యాబ్‌లను జతచేసి సేవలందించాడు దిల్‌ఖుష్. సహర్సాతో పాటు పొరుగు జిల్లాలైన సుపౌల్, దర్భంగా జిల్లాలకూ వీటి సేవలను విస్తరించాడు.
వన్-వే నుంచి టూ-వే బుకింగ్ వచ్చేలా..!
దేశంలో ప్రతిరోజూ సుమారు 1.25 బిలియన్ లీటర్ల ఇంధనం వృథా అవుతోంది.. ఎందుకంటే చాలా మంది క్యాబ్ డ్రైవర్లు ఒక ప్రదేశం నుంచి మరొక నగరానికి వెళ్లినప్పుడు కేవలం వన్-వే ప్యాసింజర్లను మాత్రమే ఎక్కించుకుంటున్నారు. దీంతో దేశంలోని అన్ని నగరాలను తమ కంపెనీ యాప్‌కి అనుసంధానించి టూ-వే బుకింగ్‌లు దొరకేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు దిల్‌ఖుష్. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సహాయంతో యాప్‌కి కావాల్సిన సాంకేతికతను అభివృద్ధి చేసి అందరికి అందుబాటులో ఉండే విధంగా అప్లికేషన్‌ను రూపొందించాడు దిల్‌ఖుష్. ఈ టెక్నాలజీ సాయంతో తమ యాప్‌లో ఇతర క్యాబ్ సర్వీసెస్ కంపెనీ డ్రైవర్ల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయని.. దీని వల్ల ప్రయాణికుడు ఏ నగరం నుంచైతే క్యాబ్‌ను బుక్ చేసుకుంటాడో ఆ ప్రదేశం నుంచే అతడికి క్యాబ్‌ను పంపించే సౌలభ్యం కల్పించామని చెబుతున్నాడు ఈ యువ పారిశ్రామికవేత్త.
రోడ్బెజ్తో రెండోసారి..
ఇంతటితో సంతృప్తి చెందలేదు దిల్‌ఖుష్. ఆర్యగో క్యాబ్ స్టార్టప్ విజయవంతం కావడం వల్ల గతేడాది రోడ్‌బెజ్ పేరుతో మరో క్యాబ్ ఆధారిత యాప్‌ను ప్రజలకు పరిచయం చేశాడు. కాగా 2016లో ఆర్యగోను స్థాపించగా.. 2022లో రోడ్బెజ్ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చాడు. ప్రస్తుతం ఈ రెండు యాప్‌ల ద్వారా ఇతడు దాదాపు 4000 వరకు కార్లతో క్యాబ్ సేవలు అందిస్తున్నాడంటే వీటికి ప్రజల నుంచి ఎంత ఆదరణ లభిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఆర్యగో బాధ్యతలు భార్యకు..
సంపాదన పెరుగుతున్న వేళ దిల్‌ఖుష్ ఆర్యగో క్యాబ్ సంస్థ బాధ్యతలను తన భార్యతో పాటు సహచురలకు అప్పగించాడు. ప్రముఖ బైక్, క్యాబ్ టాక్సీలైన ఓలా, ఊబర్ వంటి సంస్థలకు భిన్నంగా రోడ్‌బెజ్ సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు క్యాబ్ సేవలను ప్రయాణికులకు అందిస్తోందని దిల్‌ఖుష్ అన్నాడు. కాగా, 2018 జూన్ 6న స్టార్టప్ ఇండియాలో భాగంగా యువత కోసం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో దిల్‌ఖుష్ కూడా మాట్లాడాడు.
ప్రతి నగరానికి విస్తరించడమే లక్ష్యం..
బిహార్‌లో అతి పొడవైన వన్-వే టాక్సీ చైన్‌ను ప్రారంభించడం వెనుక గొప్ప ఉద్దేశం ఉందని అంటున్నాడు దిల్‌ఖుష్. ఈ రోడ్‌బెజ్ యాప్‌తో క్యాబ్ బుకింగ్ ఛార్జీల్లో ప్యాసింజర్లు 40-60 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని.. అలాగే క్యాబ్ డ్రైవర్ల సంపాదన కూడా రూ.10 నుంచి 15 వేల వరకు పెరుగుతుందని తెలిపాడు. పట్నా నుంచి వివిధ నగరాలకు వెళ్లేందుకు ప్రజలు రోడ్బెజ్కే అధిక ప్రాధాన్యమిస్తున్నారని దిల్‌ఖుష్ చెప్పాడు.